Home
»
Cinema
»
Mirai Movie Review Teja Sajja Manchu Manoj Telugu Rating 3 5
Mirai Review | “మిరాయ్” (Mirai) సినిమా రివ్యూ – తేజా సజ్జా, మంచు మనోజ్‌ల మ్యాజిక్ ఎలా ఉంది?
తేజా సజ్జా–మంచు మనోజ్ కాంబోలో వచ్చిన “మిరాయ్” అందమైన విజువల్స్, పౌరాణిక నేపథ్యంతో అలరిస్తుంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ప్రతిభాపాటవాలకు అద్దం పడుతుందీ సినిమా.
Mirai Review | “మిరాయ్” కథ పౌరాణిక నేపథ్యాన్ని నేటి కాలానికి మిళితం చేస్తూ సాగుతుంది. కళింగ యుద్ధం అనంతరం జరిగిన రక్తపాతం చూసి చలించిన అశోకుడు తన శక్తులను తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేస్తాడు. ప్రతి గ్రంథానికి ఒక దివ్య శక్తి ఉండగా, వాటిని ప్రపంచమంతటా విభజించి తొమ్మిది మంది రక్షకులకు అప్పగిస్తాడు.
అయితే ప్రస్తుత కాలంలో మహావీర్ లామా (మంచు మనోజ్) అనే క్రూరుడు ఆ గ్రంథాలన్నింటిని చేజిక్కించుకొని దైవత్వం పొందాలని ఆశపడతాడు. చివరిదైన తొమ్మిదో గ్రంథం అంబిక (శ్రియా శరణ్) వద్ద ఉంటుంది. ఆమె తన కుమారుడు వేద (తేజా సజ్జా)ను రక్షకుడిగా తయారుచేస్తుంది.
తన తల్లి, తన నిర్వర్తించాల్సిన విధి గురించి వేద ఎలా తెలుసుకున్నాడు? ఒక సాధారణ యువకుడు యోధుడిగా మారే ప్రస్థానం ఎలా సాగింది? మహావీర్ లామాను ఎలా ఎదుర్కొన్నాడు? ఇవన్నీ అసలైన కథను చెబుతాయి.
నటీనటుల ప్రదర్శన
తేజా సజ్జా – సాహసంతో కూడిన పాత్రలో సరిగ్గా సరిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లో యాక్షన్ ఎపిసోడ్లలో అతడి ఎనర్జీ బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ ఫైట్ సీన్స్‌లో తేజా కళ్లలో కనిపించే ఆవేశాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
మంచు మనోజ్ – విలన్ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. అతడి లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, పోరాట సన్నివేశాల్లో ఆగ్రహం అన్నీ కొత్తగా అనిపిస్తాయి. ప్రత్యేకంగా “శబ్ద గ్రంథం” యాక్షన్ ఎపిసోడ్ తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడని తరహా సన్నివేశం.
శ్రియా శరణ్ – అంబిక పాత్రలో మంచి నటన కనబరిచింది. కథకి భావోద్వేగం జోడించింది.
జైరాం – అగస్త్య మహర్షి పాత్రలో సరదా, సీరియస్ కలగలిపి ఆకట్టుకున్నాడు.
జగపతి బాబు, రితికా నాయక్ – తమ తమ పాత్రల మేరకు న్యాయం చేకూర్చారు.
గెటప్ శ్రీను – కొంత హాస్యాన్ని జోడించి ఈ యాక్షన్-డ్రామాలో చిన్న రిలీఫ్ ఇచ్చాడు.
సాంకేతిక విశ్లేషణ
దర్శకత్వం (కార్తీక్ ఘట్టమనేని)
కథను ఎంచుకోవడంలో ఆయన దృక్కోణం స్పష్టంగా కనిపిస్తుంది. సెటప్, స్టేజింగ్, చారిత్రక, పౌరాణిక సన్నివేశాలు అన్నీ రిచ్‌గా కనబడతాయి. అయితే, రెండో అర్థభాగంలో కథనంలో కాస్త వేగం తగ్గడం, క్లైమాక్స్‌లో కొంత పేలవంగా ఉంది.
సినిమాటోగ్రఫీ
స్వయంగా కార్తీక్ ఘట్టమనేని కెమెరా పని కూడా చూసుకున్నాడు. గ్రాఫిక్స్, విజువల్స్, వీఎఫ్ఎక్స్ కలయిక బలంగా నిలిచింది. ముఖ్యంగా సంపత్తి పక్షి సన్నివేశాలు – థియేటర్‌లో ప్రేక్షకులకు ఊపునిస్తాయి.
సంగీతం (గౌర హరి)
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఈ ఆయువుపట్టు. యాక్షన్ సీన్స్‌లోని మాస్ వైబ్, ఆధ్యాత్మిక సన్నివేశాల్లో గాఢత, ఇవన్నీ బీజీఎం వల్లే ఎలివేట్ అయ్యాయి.
ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్)
టెక్నికల్‌గా బాగానే ఉన్నా, కొన్నిచోట్ల సీన్స్ ఎక్కువ లాగినట్టు అనిపిస్తాయి. నిడివి తగ్గించి ఉంటే ఇంకా బాగా ఉండేది..
VFX
60 కోట్ల బడ్జెట్‌లోనూ హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ ఇచ్చారు. అయితే కొన్నిచోట్ల AI షాట్స్ అంతగా ఒప్పించలేకపోయాయి.
ప్లస్ పాయింట్స్
తేజా & మనోజ్ నటన – ఇద్దరూ తమ పాత్రల్లో అదరగొట్టారు.
శ్రియా శరణ్ పాత్ర సినిమాకి ప్రధాన బలం.
భారీ విజువల్స్, గ్రాఫిక్స్, VFX.
సంపత్తి పక్షి ఎపిసోడ్, శబ్ద గ్రంథం యాక్షన్ సీన్ లాంటి హైలైట్ సీక్వెన్సులు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ – సినిమాకి బలమైన ఆయుధం.
మైనస్ పాయింట్స్
కథనంలో కొన్నిచోట్ల రొటీన్ ఫీలింగ్.
సెకండాఫ్‌లో ల్యాగ్.
విలన్ ఫ్లాష్‌బ్యాక్ మరింత బలంగా ఉండాల్సింది.
క్లైమాక్స్‌లో సర్ప్రైజ్ ఎలిమెంట్ మిస్ అవ్వడం.
“మిరాయ్” ఒక విజువల్ ట్రీట్. మొత్తానికి మిరాయ్ ఒక పౌరాణిక, చారిత్రక, వర్తమాన నేపథ్యాల మేలు కలయిక – అన్నీ ప్రేక్షకుడికి అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. తేజా సజ్జా తన “హనుమాన్” తర్వాత మరోసారి గొప్ప పాత్ర ఎంచుకున్నాడు. మంచు మనోజ్ పున:ప్రవేశానికి ఇది మంచి పునాది. నిజానికి మిరాయ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని పటిమకు ఉదాహరణ. అతని కష్టానికి అన్నీ సరిగ్గా కుదిరాయి.
అయితే సెకండాఫ్ కథనం మరింత క్రిస్ప్‌గా, క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటే ఇంకా హైలైట్ అయ్యేదేమో అనిపించినా, ప్రేక్షకుడు మాత్రం సంతోషంగానే ఫీలవుతాడు. ఇది నిజం.
“మిరాయ్” – తెలుగు చలనచిత్రాలలో మరో అద్భుతమైన మైథలజికల్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్.
థియేటర్‌లో భారీ తెరపై చూడాల్సిన సినిమా ఇది. కుటుంబంతో కలసి తప్పక చూడదగ్గ చిత్రం.