Site icon vidhaatha

Rahul Dravid| రాహుల్ ద్రావిడ్ అందుకే రోల్ మోడ‌ల్‌.. ఆనంద్ మ‌హీంద్రా ప్ర‌శంస‌లు

Rahul Dravid| ఆట‌గాడిగా వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకోలేక‌పోయిన రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా మాత్రం ఆ ట్రోఫీని ముద్దాడాడు. అయితే భార‌త్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా బీసీసీఐ రూ. 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ 125 కోట్ల ప్రైజ్‌ మనీలో తన వాటాగా వచ్చిన 5 కోట్ల బోన‌స్‌లో సగం వదులుకునేందుకు నిర్ణయించుకున్నాడు.మిగిలిన కోచింగ్ స్టాఫ్ తీసుకున్న మొత్తాన్నే ద్ర‌విడ్ కూడా తీసుకునేందుకు నిర్ణ‌యించుకున్నాడు. బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌కు బోనస్ ఇచ్చినట్లే తనకు కూడా అంతే వాటాగా రూ. 2.5 కోట్ల నగదే ఇవ్వాలని రాహుల్ ద్రవిడ్ అడిగినట్లు ప‌లు వెబ్ సైట్స్ రాసాయి.

ద్రావిడ్ మ‌నోభావాల‌ని గౌర‌విస్తామ‌ని బీసీసీఐ కూడా తెలిపింద‌ట‌. బోర్డు రూపొందించిన పంపిణీ ఫార్ములా ప్రకారం.. భారత విజేత జట్టులోని 15 మంది సభ్యులతో స‌హా ద్రవిడ్ రూ. 125 కోట్ల ప్రైజ్ మనీలో రూ. 5 కోట్లు పొందాలి కాని సహాయక సిబ్బంది, సెలెక్టర్లు, రిజర్వ్ టీమ్ సభ్యులు ఒక్కొక్కరూ రూ. 2.5 కోట్లు ప్రైజ్ మ‌నీ పొందుతుండ‌డంతో అద‌నంగా వ‌చ్చే రూ.2.5 కోట్లుతాను నిరాక‌రించాడు. 2018లో భారత్ అండర్ 19 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన స‌మ‌యంలో ద్ర‌విడ్ హెడ్ కోచ్‌గా ఉన్నాడు. అప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. ఆ బహుమతిలో రాహుల్ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, మిగిలిన సహాయక సిబ్బందికి రూ. 20 లక్షలు, 30 లక్షలు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దానికి ద్రావిడ్ అంద‌రికి స‌మానంగా పంచాల‌ని కోరాడు.

అయితే రాహుల్ ద్రవిడ్ ఔన్యత్యాన్ని ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు. నిస్వార్థంగా వ్యవహరిస్తూ నిజమైన జెంటిల్‌మెన్ అని నిరూపించుకుంటున్నాడ‌ని పొగ‌డ్తల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక ద్రవిడ్‌‌పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. తన బోనస్‌ విషయంలో ద్రవిడ్ తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకం అంటూ ఆయ‌న‌ కొనియాడారు. ‘‘ఈ వ్యక్తి విలక్షణానికి ప్రతీక అని, అందుకే ఆయన ఎంతోమందికి రోల్‌మోడల్ అయ్యారంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు ఆనంద్ మ‌హీంద్రా. ఇక ఇదిలా ఉంటే ఇటీవల రాహుల్ ద్రవిడ్‌కు ఇండియన్ గవర్నమెంట్ భారతరత్న అవార్డ్ ప్రదానం చేయడం సముచితం అని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.

Exit mobile version