ED Attches Assets Of Cricketers | బెట్టింగ్ యాప్ ఎఫెక్ట్…క్రికెటర్లు రైనా, ధావన్ ఆస్తుల అటాచ్

బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఈడీ సంచలనం. సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌ ఆస్తులను రూ.11.14 కోట్లు విలువగా అటాచ్‌ చేసింది. మనీ లాండరింగ్‌ ఆరోపణలు ముదురుతున్నాయి.

Suresh Raina, Shikhar Dhawan's assets worth INR 11.4 crore attached by ED in online betting case

న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఈడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి మనీ లాండరింగ్‌ కేసులో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్‌కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్‌ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌ను కూడా ఈడీ గతంలోనే విచారించిన విషయం తెలిసిందే.

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్ వన్‌ ఎక్స్‌బెట్‌ కు సంబంధించిన కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ క్రికెటర్ల ఆస్తుల అటాచ్ కు చర్యలు తీసుకుంది. ఈడీ జాబితా హిట్ లిస్టులో రైనా, ధావన్ తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటుడు సోను సూద్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా పేర్లు సైతం ఉన్నాయి. అదే సమయంలో పలువురు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం ఈడీ జాబితాలో ఉన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌లు, కంపెనీల నుంచి పొందిన ఎండార్స్‌మెంట్ ఫీజుల ద్వారా సంపాదించిన ఏదైనా ఆస్తి నేరం మార్గంలో వచ్చిన ఆదాయమేనని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈడీ నిఘాలో ఉన్న వారి ఆస్తుల్లో భారత్‌తో పాటు విదేశాల్లో ముఖ్యంగా యూఏఈలో స్థిరచరాస్తులు ఉన్నాయి. ముందుగా సదరు ఆస్తులను తాత్కాలిక అటాచ్‌మెంట్‌ కోసం ఉత్తర్వులు జారీ చేసి.. అవసరమైన ఆమోదం కోసం పీఎంఎల్‌ఏ అథారిటీకి పంపిస్తారు. ఆమోదం వచ్చాక ప్రత్యేక కోర్టులో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసి..ఆయా ఆస్తులను శాశ్వతంగా జప్తు చేయనుంది.