Site icon vidhaatha

Mashrafe Mortaza | బంగ్లాదేశ్ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మష్రఫే మోర్తాజా ఇంటికి నిప్పుపెట్టిన దుండగులు..!

Mashrafe Mortaza | పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. ప్రధాని షేక్‌ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చారు. సైన్యం దేశాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నది. ఆ తర్వాత దేశంలో హింస మరింత ముదిరింది. ప్రధాని షేక్‌ హసీనా అధికారిక నివాసంపై నిరసనకారులు దాడులకు తెగబడి లూటీచేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్లు మాజీ కెప్టెన్‌ మష్రఫె మోర్తజా ఇంటికి సైతం నిరసనకారులు నిప్పుపెట్టారు. మోర్తజా బంగ్లాదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షేక్‌ హజసీనా పార్టీ అయిన అవామీ లీగ్‌ తరఫున ఖుల్నా డివిజన్‌లోని నరైల్‌-2 నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

ఇక్కడి నుంచి వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానిపై ఉన్న కోపంతో నిరసనకారులు మాజీ క్రికెటర్‌ ఇంటికి నిప్పుపెట్టారు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలని గతకొంతకాలంగా విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. అయితే, నిరసనలు హింసాత్మకంగా మారడంతో వాటిని వణచివేయాలని షేక్‌ హసీనా ప్రభుత్వం ఆదేశించింది. రోజు రోజుకు హింస మరింత పెరిగింది. రిజర్వేషన్ల రద్దును డిమాండ్‌ చేస్తూ వచ్చిన నిరసనకారులతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు ప్రయత్నించినా విఫలమయ్యాయి. ఆ తర్వాత ప్రధాని రాజీనామా చేయాలంటూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పరిస్థితి రోజులు రోజుకు మరింత విషమిస్తుండడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్‌ హసీనా భారత్‌కు వచ్చారు.

ఆ తర్వాత రెచ్చిపోయిన నిరసనకారులు మష్రఫే ముర్తాజా ఇంటిపై దాడి చేసి నిప్పంటించారు. మష్రఫే మొర్తజా క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్‌ అనంతరం 2018లో అవామీ లీగ్‌ పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. నరైల్‌-2 నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలుపొందాడు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు మష్రఫే మొర్తజా 117 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. జట్టు తరఫున 36 టెస్టులు, 220 వన్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 36 టెస్టు మ్యాచ్‌ల్లో మాజీ కెప్టెన్ బ్యాటింగ్‌ 797 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 78 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 270 వికెట్లు, 1787 పరుగులు.. టీ20లో 42 వికెట్లు, 377 పరుగులు చేశాడు.

Exit mobile version