T20 World Cup 2024 Ind vs Eng ఇంగ్లండ్​పై ప్రతీకారం తీర్చుకున్న భారత్​ – ప్రపంచకప్​ ఫైనల్లో ప్రవేశం

భారత్​ బదులు తీర్చుకున్నది. పోయిన ప్రపంచకప్​లో ఇంగ్లండ్​ నుండి తీసుకున్న పరాభవాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించింది. సగర్వంగా టి20 వరల్డ్​కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నెల 29న దక్షిణాఫ్రికాతో ఆఖరిపోరులో తలపడనుంది.

  • Publish Date - June 28, 2024 / 02:10 AM IST

టి20 ప్రపంచకప్​ టోర్నీ(T20 World Cup 2024) సెమీ ఫైనల్(Semi-Final)​ పోటీలో భారత్​ (India) ఇంగ్లండ్(England)​పై చిరస్మరణీయమైన ఘనవిజయం సాధించి ​ఫైనల్లో ప్రవేశించింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ప్రతిగా ఇంగ్లండ్​ 16.4 ఓవర్లలో 103 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా భారత్​ 68 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.

వర్షం కారణంగా టాస్​ ఆలస్యమైనా, ఆశ్యర్యకరంగా వరుణుడు ఆటకు ఆటంకం మాత్రం కలిగించలేదు. వాతావరణ శాఖ రోజంతా వానేనని హెచ్చరించినా, మంచి ఎండ కాసి మ్యాచ్​ను కొనసాగనించింది. ముందుగా బ్యాటింగ్​ దిగిన భారత్​ ఎప్పటిలాగే కోహ్లీ(9) వికెట్​ను త్వరగానే కోల్పోగా, కెప్టెన్​ రోహిత్​ శర్మ పట్టువదలని విక్రమార్కుడిలా రెచ్చిపోయాడు. పంత్​(4) కూడా విఫలమయ్యాడు. అప్పడొచ్చిన సూర్యకుమార్​ యాదవ్​తో కలిసి రోహిత్​ ఆటను తిరిగి గాడిలో పెట్టాడు. రన్​రేట్​ను 8కి తగ్గకుండా చూసుకుంటూ వీరిద్దరూ ధాటిగా ఆడారు. మూడో వికెట్​కు విలువైన 73 పరుగులు జోడించిన ఈ జంట, వెంటవెంటనే పెవిలియన్​కు చేరుకుంది. రోహిత్​ శర్మ Rohit Sharma 57 (6 ఫోర్లు, 2 సిక్స్​లు) పరుగులు, సూర్య Surya Kumar yadav 47(4ఫోర్లు, 2 సిక్స్​లు) చేసారు. తర్వాత హార్థిక్​ పాండ్యా(13 బంతుల్లో 23) ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడగా, చివర్లో జడేజా(9 బంతుల్లో 17)), అక్షర్​(6 బంతుల్లో 10) ధాటిగా ఆడి కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్​ ముందుంచారు. ఆఖరికి నిర్ణీత 20 ఓవర్లలో భారత్​ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. India are 171/7 in 20 Overs.

ఇంగ్లండ్​ బౌలర్లలో క్రిస్​ జోర్డాన్​ మూడు వికెట్లు తీయగా, టాప్లీ, ఆర్చర్​, కరన్​, అదిల్​ తలా ఒకో వికెట్​ తీసుకున్నారు.

గయానా ప్రొవిడెన్స్​ పిచ్​పై కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లండ్​, అక్షర్​ పటేల్​(Axar Patel) స్పిన్​ ఉచ్చులో పడి విలవిలలాడింది. వేసిన ప్రతీ ఓవర్​ మొదటి బంతికి వికెట్​ తీసుకున్న అక్షర్​, ఇంగ్లండ్​ వెన్నులో వణుకు పుట్టించాడు. మొదటి నలుగురిలో ముగ్గురు ( బట్లర్(23)​, మొయిన్​ ఆలీ(8), బెయిర్​స్టో(0)) అక్షర్​కు బలవ్వగా, ఒక్కడు(ఫిల్​ సాల్ట్​(5)) బుమ్రా ఖాతాలోకి వెళ్లాడు. ఇక అక్కన్నుంచి వికెట్లు తీసే బాధ్యతను కుల్​దీప్​(Kuldeep Yadav) తీసుకున్నాడు. పవర్​ ప్లేలో 3 వికెట్లకు 39 పరుగులు చేసిన ఇంగ్లండ్​, 10 ఓవర్లలో 5 వికెట్లకు 62 పరుగులకు చేరింది. హ్యారీ బ్రూక్​(25), సామ్​ కరన్​(2), జోర్డాన్​(1) కుల్​దీప్​ యాదవ్​ స్పిన్​ వలలో చిక్కుకుని పెవిలియన్​కు చేరారు. 15 ఓవర్లకు ఇంగ్లండ్​ స్కోరు ఒక రనౌట్​తో 8 వికెట్ల నష్టానికి 86 పరుగులు. మరో వికెట్​(రషీద్​)ను కూడా రనౌట్​ రూపంలో చేజార్చుకున్న ఇంగ్లండ్​ చివరికి 16.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్​ అయింది. England 103 All out.

భారత బౌలర్లలో అక్షర్​ పటేల్​, కుల్​దీప్ యాదవ్​ చెరో మూడు వికెట్లతో విజృంభించగా, బుమ్రా 2 వికెట్లు తీసాడు. మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​గా అక్షర్​ పటేల్​ ఎంపికయ్యాడు.

ఎల్లుండి బ్రిడ్జ్​టౌన్​లో జరిగే ఫైనల్​ పోరులో దక్షిణాఫ్రికా(South Africa)తో తలపడటానికి భారత్​ సిద్ధమయింది.

 

Latest News