India-Bangladesh T20 Series: బంగ్లాదేశ్‌తో నేడు మొదలైన టి20 సిరిస్ మొదటి మ్యాచ్ గ్వాలియర్(Gwalior)లో జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి వన్డే డబుల్ సెంచరీ సచిన్ టెండుల్కర్ ద్వారా నమోదైన ఈ వేదిక చరిత్ర సృష్టించింది. నేడు ఇదే గ్రౌండ్లో నెక్స్ట్ జనరేషన్ టీమ్ బంగ్లాపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి, అలవోక విజయం సాధించింది India win by 7 wickets.
టాస్ గెలిచి బంగ్లాకు బ్యాటింగ్ అప్పగించిన భారత్, సరైన నిర్ణయమే తీసుకుంది. ఆరంభంలోనే నిప్పులు కురిపించిన అర్షదీప్ సింగ్ టపాటపా రెండు వికెట్లు నేలకూల్చాడు. ఆర్షదీప్(Arshdeep Singh) దెబ్బకు ఓపెనర్లిద్దరూ 14 పరుగులకే డగౌట్‌కు చేరారు. ఆ తర్వాత కుదుటపడుతున్నట్టనిపించిన కెప్టెన్ శాంటోను వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్ ద్వారా అవుట్ చేయగా, ప్రమాదకర బ్యాటర్ మహమ్మదుల్లాను ఆరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్ ఒక్క పరుగుకే ఇంటికి పంపాడు. మిడిలార్డర్‌ను స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) మూడు వికెట్లు తీసి కుప్పకూల్చగా, మెహదీ హసన్ ఒక్కడే కాస్త పోరాడాడు. మిగతావారిలా వచ్చి అలా వెళ్లారు. భారత బౌలర్లలో అర్షదీప్, వరుణ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, మయాంక్, హార్థిక్, సుందర్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
తదనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత్‌కు అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16, 1 సిక్స్, 2 ఫోర్లు) జెట్ స్పీడ్నందించాడు. కానీ, సంజూతో సమన్వయలోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. సంజూతో జతకలిసిన కెప్టెన్ సూర్య ధనాధన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ముందుకు నడిపించాడు. వేగం పెంచే క్రమంలో సంజూ(19 బంతుల్లో 29, 6 ఫోర్లు), సూర్య(14 బంతుల్లో 29, 3 సిక్స్‌లు, 2ఫోర్లు) ఔటైనా, నితీశ్‌కుమార్ రెడ్డి(15 బంతుల్లో 16, ఒక సిక్స్), హార్థిక్ పాండ్యా(16 బంతుల్లో 39, 2 సిక్స్‌లు, 5 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. తుదకు భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా సుడిగాలి ఇన్నింగ్స్‌తో పాండ్యా చెలరేగిపోయాడు. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్, మెహదీ హసన్ చెరో వికెట్ తీసారు.