చరిత్ర సృష్టించిన టీమిండియా – ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్‌పై విజయం

India-England 5th Test | లండన్‌ ఓవల్‌ మైదానం – ఆఖరిరోజున ఉదయం చల్లని గాలి వీచినా, మైదానంలో ఉత్కంఠ మంటలలా రగులుతోంది. 374 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ 339/6తో క్రీజులో ఉండగా వారికి కావాల్సింది కేవలం 35 పరుగులు మాత్రమే. చేతిలో నాలుగు వికెట్లు ఉండటంతో ఇంగ్లాండ్‌ గెలుపు ఖాయం అనిపించింది. గ్యాలరీల్లోని స్థానిక అభిమానులు ఆనందంతో ఊగిపోతుండగా,  భారత అభిమానుల కళ్ళల్లో మాత్రం ఆందోళన స్పష్టంగా కనిపించింది. కానీ ఇక్కడే ఓ అద్భుతం జరిగింది.

  • Publish Date - August 4, 2025 / 08:34 PM IST
  • ఆరు పరుగుల తేడాతో భారత్ ​అద్భుత విజయం
  • గెలుపు పక్కా చేసిన హైదరాబాదీ సిరాజ్‌మియా
  • తోడుగా ప్రసిద్ధ కృష్ణ 4 వికెట్ల జోరు
  • కేవలం 35 పరుగుల లక్ష్యాన్నికాపాడుకున్నభారత్​

ఆఖరి రోజు ఆట మొదలైన క్షణాలు ఇంగ్లాండ్‌ ఆధిపత్యంలోనే సాగాయి. జేమీ ఓవర్టన్‌  తొలిఓవర్‌లో రెండు బౌండరీలు బాదడంతో అక్కడికక్కడే ఉత్సాహం పెరిగింది. కానీ అదే క్షణం ఆటదిశను మార్చిన పేరు – మొహమ్మద్సిరాజ్‌. తన రన్‌అప్‌లోనే దూకుడుగా కనిపించిన సిరాజ్‌, బంతిని చివరిక్షణంలో అద్భుతంగా స్వింగ్‌ చేసి జేమీస్మిత్‌ను ధ్రువ్‌ జురేల్‌ చేతికి అందించాడు. ఆ ఒక్క వికెట్‌ భారత్‌ గెలుపు ఆశలపై అమృతం చిలికింది.

అదే ఉత్సాహంతో వేసిన తదుపరి ఓవర్‌లో ఓవర్టన్‌ కాళ్ల ముందు పడ్డ బంతితో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఓవర్టన్‌  ఔట్‌తో ఇంగ్లాండ్‌ డ్రెస్‌రూమ్‌లో ఆందోళన మొదలైంది. ఈ దశలోప్రసిద్ధ్‌ కృష్ణ తనవేగం, కచ్చితత్వంతో జోష్‌ టంగ్‌ స్టంప్స్‌ను ఎగరగొట్టాడు.అప్పటికి ఇంగ్లాండ్‌ స్కోరు 357/9కి చేరింది.

మైదానంలో వాతావరణం మరింత ఆసక్తికరంగా మారింది. గాయంతో భుజానికి పట్టి కట్టుకున్న క్రిస్‌ వోక్స్‌ ఒంటిచేత్తో ఆడటానికి క్రీజులోకి వచ్చాడు. అతడి ధైర్యసాహసాలు క్షణంపాటు భారత అభిమానుల గుండెల్లో భయం నింపాయి. సిరాజ్‌ వేసిన బంతిని అట్కిన్సన్‌ స్టాండ్లలోకి సిక్స్‌గా పంపడంతో ఇరువర్గాల అభిమానులకు నరాలు తెగడం మొదలైంది. కానీ సిరాజ్‌ వెనక్కి తగ్గలేదు. తరువాతి ఓవర్లో తన క్లాసిక్‌ ఇన్‌స్వింగ్‌ డెలివరీతో అట్కిన్సన్‌ స్టంప్స్‌ను కూల్చేయడంతో సంబరాలు మొదలయ్యాయి.

ఆ క్షణం మైదానమంతా ఉత్సాహంతో మార్మోగింది. సహచరులు సిరాజ్‌ను ఎత్తుకొని అభినందించారు.  గ్యాలరీల్లోని భారత అభిమానులు జాతీయ జెండాలతో విజయగీతాలు పాడారు. మొహమ్మద్సిరాజ్ ఈ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, మొత్తంగా మ్యాచ్‌లో 9 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ దిమ్యాచ్‌గా నిలిచాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ 4 వికెట్లు, ఆకాశ్​దీప్‌ ఒక వికెట్‌ తీసి కీలక సహకారం అందించారు.

మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 224 పరుగులకు ఆలౌట్‌ కాగా, ఇంగ్లాండ్‌ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 396 పరుగులతో భారీ స్కోరు చేసినా ఇంగ్లండ్​ ఏమాత్రం తగ్గకుండా దీటైన జవాబిచ్చింది. కేవలం 35 పరుగుల లక్ష్యంతో 5వ రోజు బరిలోకి దిగిన ఇంగ్లీష్​ టీమ్​, ఏ మాత్రం ఊహించని ఓటమి చవిచూసింది. దానికి కారకుడైన సిరాజ్​ను యావత్ ​భారత్​ అభినందనల్లో ముంచెత్తింది. చివరకు 6 పరుగుల తేడాతో సాధించిన ఈ  విజయం భారత్‌కు అరుదైన ఘనతగా నిలిచింది. 2004లో ఆస్ట్రేలియాపై 13 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత, విదేశీగడ్డపై ఇంత తక్కువ తేడాతో వచ్చిన గెలిచిన మ్యాచ్​ ఇదే. “గెలుపు సాధించగలననే నమ్మకం నాలో ఎప్పుడూ ఉంటుంది” అని మ్యాచ్‌ అనంతరం సిరాజ్‌ గర్వంగా అన్నాడు. ఈ విజయం భారతజట్టు తుదిశ్వాస వరకు పోరాడేతత్వానికి మళ్లీ రుజువుగా నిలిచింది. ఈ గెలుపుతో ఆండర్సన్‌–తెందూల్కర్‌ ట్రోఫీ 2-2తో డ్రాగా ముగిసింది.