Mushroom Farming | ఒడిశా( Odisha )లోని కటక్ జిల్లా( Cuttack District )కు చెందిన మానస్ రంజన్ దాస్( Manas Ranjan Das )కు ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్( Ankylosing Spondylitis ) అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధి అతని మెడ కదలికలను పరిమితం చేస్తుంది. దీంతో అతను ఎక్కువ సమయం తన మెడకు పని చెప్పలేడు. కానీ వ్యవసాయం మీదున్న మక్కువతో.. ఉన్న పొలంలో పుట్టగొడుగుల సాగు(Mushroom Farming )ను ప్రారంభించాడు. తక్కువ ఖర్చుతో వరిగడ్డి పుట్టగొడుగులు( paddy straw mushrooms ), ఆయిస్టర్ పుట్టగొడుగులను( oyster mushrooms ) పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు.
250 వెదురు కాండాలను ఉపయోగించి
మానస్ రంజన్ 250 వెదురు కాండాలను ఉపయోగించి పుట్టగొడుగుల యూనిట్‌ను ప్రారంభించాడు. ఇందుకు రూ. 45 వేలు ఖర్చు పెట్టాడు. ఇక మార్చి నుంచి అక్టోబర్ మధ్య వరిగడ్డి పుట్టగొడుగులను, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఆయిస్టర్ పుట్టగొడుగుల సాగు చేస్తున్నాడు.
16 నుంచి 17 రోజుల్లో చేతికి
వరిగడ్డి పుట్టగొడుగులు 16 నుంచి 17 రోజుల్లో చేతికి అందుతాయి. వీటిని రూ. 250 నుంచి రూ. 300 వరకు కేజీ చొప్పున విక్రయిస్తున్నాడు. ఇక కొన్ని ఆయిస్టర్ పుట్టగొడుగులను ఎండబెట్టి పొడిగా మార్చుతున్నాడు. ఈ పొడి కాల వ్యవధి ఏడాది మాత్రమే. కేజీ పుట్టగొడుగుల పొడిని రూ. 1000కి విక్రయిస్తు లాభాలు గడిస్తున్నాడు. వరిగడ్డి పుట్టగొడులు, ఆయిస్టర్ పుట్టగొడుగులను విక్రయిస్తూ ఏడాదికి రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు.
20 రోజుల్లోనే లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు
ఇక ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు కటక్‌లో ఏర్పాటు చేసే బాలి యాత్రకు మానస్ తన భార్యతో కలిసి హాజరవుతాడు. ఈ యాత్ర ప్రతి ఏడాది నవంబర్ – డిసెంబర్ నెలల్లో జరుగుతుంది. ఆయన భార్య రితాంజలి ఆయిస్టర్ మష్రూమ్ పికెల్స్, పౌడర్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. వీటన్నింటిని 15 నుంచి 20 రోజుల యాత్రలో విక్రయిస్తాడు. 200 గ్రాముల పికెల్స్‌ను రూ. 90కి, 100 గ్రాముల పౌడర్‌ను రూ. 100కు విక్రయిస్తాడు. ఆ 20 రోజుల పాటు వీటిని విరివిగా కస్టమర్లు కొనుగోలు చేస్తారు. ఈ 20 రోజుల్లోనే లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు ఆదాయాన్ని కూడబెడుతారు. మానస్ వద్ద ఇద్దరు పూర్తిస్థాయి కార్మికులు పని చేస్తున్నారు. మరో ఐదారుగురు రోజు కూలీలుగా ఉపాధి పొందుతున్నాడు. వీరికి రోజుకు రూ. 400 చొప్పున కూలీ చెల్లిస్తున్నాడు.
పుట్టగొడుగుల సాగుపై దృష్టి ఇలా..
మానస్ 2000 ఏడాదిలో లక్ష్మీనారాయణ సాహు మహావిద్యాలయ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ షాపులో సేల్స్‌మేన్‌గా పని చేశాడు. నాడు నెలకు రూ. 600 చొప్పున మానస్ జీతం అందుకునేవాడు. జీతం సరిపోక 2016లో ఓ కాలేజీలో చేరాడు. నెలకు రూ. 10 వేలు వచ్చేవి. ఈ కాలేజీలో పని చేస్తున్న సమయంలోనే స్థానికంగా ఉన్న రైతులు చేస్తున్న పుట్టగొడుగుల సాగు మీద దృష్టి సారించాడు. దాంతో వారిని ఆదర్శంగా తీసుకుని మానస్ పుట్టగొడుగుల సాగు ప్రారంభించి నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు.
