Site icon vidhaatha

Champions Trophy | లాహోర్‌లో మార్చి 1న పాక్‌ – భారత్‌ హైవోల్టోజ్‌ మ్యాచ్‌..! ఛాంపియన్స్‌ ట్రోఫీ డ్రాఫ్ట్‌ సిద్ధం చేసిన పీసీబీ..!

Champions Trophy | వచ్చే ఏడాది పాక్‌ వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగనున్నది. ఈ ఐసీసీ నిర్వహించబోతున్న మెగా టోర్నీలో ఎనిమిది దేశాలు పాల్గొననున్నాయి. టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ను పీసీబీ సిద్ధం చేసి ఐసీసీకి పంపింది. నివేదిక ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. మీడియా నివేదికల ప్రకారం.. ఫిబ్రవరి 19న మొదలై.. మార్చి 9 వరకు కరాచీ, రావల్పిండి, లాహోర్‌ వేదికగా మ్యాచులు జరుగనున్నాయి. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఐసీసీ ఈ టోర్నీని 50 ఓవలర్ల ఫార్మాట్‌లో నిర్వహించబోతున్నది. గ‌తేడాది భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్రపంచ కప్‌లో టాప్ – 8లో నిలిచిన జట్లు నేరుగా ఛాంపియ‌న్స్ ట్రోపీ తలపడనున్నాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు వెళ్తాయి. ఇక గ్రూప్‌-ఏలో ఆతిథ్య పాకిస్థాన్‌తో పాటు భారత్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్ – బీలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు ఉన్నాయి. ఇక భారత జట్టు గ్రూప్‌ మ్యాచులన్నీ లాహోర్‌ వేదికగా ఆడనున్నది. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న న్యూజిలాండ్‌తో ఆడుతుంది. ఇక దాయాది దేశాలైన భారత్‌ – పాక్‌ మధ్య హైవోల్టేజ్‌ మ్యాచ్‌ మార్చి 1న జరుగననున్నది. ట్రోఫీలో రౌండ్ రాబిన్ దశ మార్చి 2న ముగుస్తుంది. రెండు సెమీ ఫైనల్‌లు వరుసగా మార్చి 5, 6న కరాచీ, రావల్పిండిలో నిర్వహిస్తారు. ఫైన‌ల్ మ్యాచ్‌ మార్చి 9న లాహోర్‌లో జరుగుతుంది. ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌డే సైతం ఉన్నది.

టీమిండియా మ్యాచులన్నీ లాహోర్‌లోనే..

ఐసీసీ టోర్నీ మొత్తం మూడు స్టేడియాల్లోనే జరుగనున్నది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం, కరాచీ నేషనల్ స్టేడియం, రావల్పిండిలోని స్టేడియాల్లో జరుగనున్నాయి. మొత్తం 15 మ్యాచుల్లో ఏడు లాహోర్‌, మూడు కరాచీ, ఐదు రావల్పిండిలో నిర్వహించేందుకు పీసీబీ షెడ్యూల్‌ నమూనాను సిద్ధం చేసింది. భద్రతా, రవాణా కారణాలను దృష్టిలో పెట్టుకొని భారత్‌ మ్యాచులన్నీ లాహోర్‌ గడాఫీ స్టేడియంలో ఆడేలా షెడ్యూల్‌ డిజైన్‌ చేసింది. భారత్‌ సెమీస్‌కు ఫైనల్‌ వరకు వెళ్లినా లాహోర్‌లోనే జరుగుతుంది. ఇదిలా ఉండగా.. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగడం లేదు. 2008 ఆసియా కప్‌ తర్వాత భారత్‌ జట్టు పాక్‌ పర్యటనకు వెళ్లింది లేదు. ఐసీసీ టోర్నీలో ఇరుజట్లు పోటీపడిందే తప్ప.. ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొనలేదు. ఇప్పటికే సభ్య దేశాలన్నీ ఐసీసీ చాంఫియన్స్‌ ట్రోఫీకి మద్దతు తెలిపాయి. అయితే, ట్రోఫీకి కోసం భారత జట్టును పాక్‌కు పంపుతుందా? లేదా? అన్నది తెలియరాలేదు. భారత ప్రభుత్వం నిర్ణయం మేరకే బీసీసీఐ ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌

ఫిబ్రవరి 19 : న్యూజిలాండ్ Vs పాకిస్థాన్ – కరాచీ
ఫిబ్రవరి 20 : బంగ్లాదేశ్ Vs భారత్ – లాహోర్
ఫిబ్రవరి 21 : ఆఫ్ఘనిస్థాన్‌ Vs దక్షిణాఫ్రికా – కరాచీ
ఫిబ్రవరి 22 : ఆస్ట్రేలియా Vs ఇంగ్లండ్‌ – లాహోర్
ఫిబ్రవరి 23 : న్యూజిలాండ్ Vs భారత్ – లాహోర్
ఫిబ్రవరి 24 : పాకిస్థాన్ Vs బంగ్లాదేశ్ – రావల్పిండి
ఫిబ్రవరి 25 : ఆఫ్ఘనిస్థాన్‌ Vs ఇంగ్లండ్‌ – లాహోర్
ఫిబ్రవరి 26 : ఆస్ట్రేలియా Vs దక్షిణాఫ్రికా – రావల్పిండి
ఫిబ్రవరి 27 : బంగ్లాదేశ్ Vs న్యూజిలాండ్ – లాహోర్
ఫిబ్రవరి 28 : ఆఫ్ఘనిస్థాన్‌ Vs ఆస్ట్రేలియా – రావల్పిండి
మార్చి 1 : పాకిస్థాన్ Vs భారత్ – లాహోర్
మార్చి 2 : దక్షిణాఫ్రికా Vs ఇంగ్లండ్‌ – రావల్పిండి
మార్చి 5 : సెమీ-ఫైనల్ – కరాచీ
మార్చి 6 : సెమీ-ఫైనల్ – రావల్పిండి
మార్చి 9 : ఫైనల్‌ – లాహోర్

Exit mobile version