T20 World Cup | టి20 వరల్డ్​కప్​లో భారత్​ బోణీ

టి20 పురుషుల ప్రపంచకప్​లో భారత్​ (India) బోణీ కొట్టింది. తన తొలిమ్యాచ్​లో పసికూన ఐర్లండ్(Ireland)​తో న్యూయార్క్​, అమెరికాలో జరిగిన మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

  • Publish Date - June 5, 2024 / 11:29 PM IST

న్యూయార్క్​: టి20 పురుషుల ప్రపంచకప్​లో భారత్​ (India) బోణీ కొట్టింది. తన తొలిమ్యాచ్​లో పసికూన ఐర్లండ్(Ireland)​తో న్యూయార్క్​, అమెరికాలో జరిగిన మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్​ గెలిచి, బౌలింగ్​ ఎంచుకున్న ఇండియా నిర్ణయం సరైనదేనంటూ బౌలర్లు నిరూపించారు. న్యూయార్క్​(New york) బౌన్సీ పిచ్​పై అవగాహన ఉన్న రోహితో మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్​నే తీసుకున్నాడు. భారత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ఐర్లండ్​ బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ వికెట్​ వెనుక వికెట్​ తీస్తూ పోయారు. మొదట ఇన్నింగ్​ మొదటి ఓవర్​ బౌలింగ్​ తీసుకున్న అర్షదీప్​సింగ్​, 3 పరుగులతో సరిపెట్టగా, రెండో ఓవర్​ వేసిన సిరాజ్​ ఒక ఫోర్​తో 4 పరుగులు ఇచ్చాడు. తిరిగి మూడో ఓవర్​లో బౌలింగ్​కు వచ్చిన అర్షదీప్​సింగ్​ వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద ఉన్నప్పుడు మొదటి వికెట్​ కోల్పోయిన ఐర్లండ్​ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.పవర్​ ప్లే లో 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు మాత్రమే చేసిన ఐర్లండ్​,  చివరికి 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్​ అయింది. ఐర్లండ్​ జట్టులో నలుగురు రెండంకెల స్కోర్​ చేయగా, ఒక్కరు మాత్రమే  20 పరుగు దాటగలిగారు. భారత బౌలర్లలో అర్షదీప్​సింగ్(2)​, పాండ్యా(3), బుమ్రా(2) నిప్పుల్లాంటి బంతులతో ఐర్లండ్​ను వణికించారు. సిరాజ్​, అక్షర్​ చెరో వికెట్​ తీయగా, ఆఖరి వికెట్​ నోబాల్​లో రనౌట్​గా కుప్పకూలింది.

తరువాత రోహిత్​, కోహ్లీ ఓపెనర్లుగా ధాటిగా బ్యాటింగ్​ ప్రారంభించిన భారత్​, మూడో ఓవర్లో కోహ్లీ(1) వికెట్​ కోల్పోయింది. రోహిత్​కు జత కలిసిన పంత్​ నిదానంగా ఆడుతూ, రోహిత్​కు మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్​కు 54 పరుగులు జోడించారు. రోహిత్​ శర్మ(52 : 4 ఫోర్లు, 3 సిక్స్​లు) భుజం గాయంతో రిటైర్డ్​ హర్ట్గ్​గా వెనుదిరగగా, వచ్చిన సూర్యకుమార్​ యాదవ్​(2) భారీ షాట్​కు ప్రయత్నించి అవుటయ్యాడు. తరువాత వచ్చిన శివం దూబె(0 నాటౌట్​)తో కలిసి మరో వికెట్​ పడకుండా పంత్​(36 నాటౌట్​:  3 ఫోర్లు, 2 సిక్స్​లు) మిగతా లాంఛానాన్ని పూర్తి చేసాడు. భారత్​ తన లక్ష్యాన్ని 12.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 97 పరుగులు సాధించి చేరుకుంది. ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా బుమ్రా(3–1–6–2) ఎంపికయ్యాడు.

ఐర్లండ్​ బౌలర్లలో మార్క్​ అడైర్​ , బెన్​ వైట్​ చెరో వికెట్​ తీసుకున్నారు.

 

Latest News