Site icon vidhaatha

IPL 2024 SRH vs RR | రాజస్థాన్​పై హైదరాబాద్​ గెలుపు

ఐపిఎల్​–2024లో భాగంగా హైదరాబాద్​లో జరుగుతున్న 50వ మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​, రాజస్థాన్​ రాయల్స్​ జట్లు తలపడగా, విజయం సన్​రైజర్స్​ను వరించింది. టాస్​ గెలిచి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్​కు దిగిన హైదరాబాద్​, పవర్​ప్లేలో బాగా తడబడింది. 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి దీనస్థితిలో ఉన్న హైదరాబాద్​ను ట్రావిస్​ హెడ్​ (44 బంతుల్లో 58), తెలుగు కుర్రాడు నితీశ్​ కుమార్​ రెడ్డి (42 బంతుల్లో 76) ఆదుకున్నారు. ముఖ్యంగా నితీశ్​ రెచ్చిపోయి సిక్సర్ల మీద సిక్సర్లు దంచి కొట్టాడు. హెడ్​ అవుటయిన తర్వాత క్లాసెన్​, నితీశ్​తో జతకలిసి స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. చివరికి సన్​రైజర్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఒక దశలో 150 పరుగులు కూడా కష్టసాధ్యమనుకున్న హైదరాబాద్​ వీరిద్దరి సహకారంతో 200 పరుగుల మార్కును దాటగలిగింది.

రాజస్థాన్​ బౌలర్లలో ఆవేశ్​ ఖాన్​ 2, సందీప్​ శర్మ ఒక వికెట్​ తీసుతకున్నారు.

202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్​కు తొలి ఓవర్లోనే భారీ దెబ్బ తగిలింది. భువనేశ్వర్​ కుమార్​ అద్భుతమైన బౌలింగ్​కు రాజస్థాన్​ ఓపెనర్లు, కీలక బ్యాటర్లు బట్లర్​ (0), కెప్టెన్​ సంజూ(0) ఒక్క పరుగు స్కోరుకే వెనుదిరిగారు.  ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన రాయల్స్​ను యశస్వి జైస్వాల్​(40 బంతుల్లో 67)), రియాన్​ పరాగ్​(49 బంతుల్లో 77) అద్భుతమైన పోరాటపటిమ కనబరిచి నిలబెట్టారు. వికెట్లు పడ్డాయన్న బాధేమీలేకుండా వారిద్దరూ యధేచ్చగా షాట్లు కొట్టారు. వీరు మూడో వికెట్​కు ఏకంగా 134 పరుగుల భాగస్వామ్యం కల్పించి తిరిగి రాజస్థాన్​ను రేసులోకి తీసుకొచ్చారు.

నరాలు తెగిన చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సినప్పుడు భువనేశ్వర్​ బౌలింగ్​లో రోవ్​మన్​ పావెల్​, అశ్విన్​ కలిసి 11 పరుగులు చేయగా, ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సివచ్చాయి. ఆ బంతిని సరిగ్గా పావెల్​ ప్యాడ్ల మీదకు విసరడంతో గురితప్పిన పావెల్​ ఎల్​బీడబ్ల్యూ అయ్యాడు. దాంతో ఒక్క పరుగుతో విజయం హైదరాబాద్​ వశమయింది. 20 ఓవర్లలో రాజస్థాన్​ సరిగ్గా 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.

హైదరాబాద్​ బౌలర్లలో భువనేశ్వర్​ 3, కమ్మిన్స్​ , నటరాజన్​ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Exit mobile version