IPL 2024 DC vs SRH : ఢిల్లీలో క‌దం తొక్కిన హైద‌రాబాద్‌

స‌న్‌రైజ‌ర్స్ మ‌ళ్లీ... ఈసారి ఢిల్లీ. హైదరాబాద్ బ్యాట‌ర్ల‌కు అడ్డే లేకుండా పోతోంది. 250 ప‌రుగులు చేయ‌డం వారికి చాలా మామూలుగా మారిపోయింది. ఈరోజు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో ఇండియా క్యాపిట‌ల్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌ళ్లీ దంచి కొట్టి 266 ప‌రుగులు చేసింది. ఫ‌లితంగా 67 ప‌రుగుల తేడాతో ఢిల్లీపై ఘ‌న‌విజ‌యం  సాధించింది.

  • Publish Date - April 20, 2024 / 11:29 PM IST

రికార్డులే రికార్డులు… హైద‌రాబాద్ ఓపెన‌ర్లు సృష్టించిన ప‌రుగుల సునామీలో అరుణ్‌జైట్లీ స్టేడియం కొట్టుకుపోయింది. ఐపిఎల్‌-2024లో భాగంగా ఇక్క‌డ జ‌రిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి, బ్యాటింగ్‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 266 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఈసారి కూడా 22 సిక్స్‌లు కొట్టిన హైదరాబాద్‌, 18 ఫోర్లు సాధించింది. గ‌త మ్యాచ్‌లో కూడా స‌న్‌రైజ‌ర్స్ 22 సిక్స‌ర్లు కొట్టింది.

ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ పూన‌కం వ‌చ్చినట్లు బాల్ క‌న‌బ‌డితే చాలు, స్టాండ్స్‌లోకి పంపించాడు. 5 ఓవ‌ర్ల‌కే 100 ప‌రుగులు చేసిన హైద‌రాబాద్‌, ప‌వ‌ర్‌ప్లే ముగిసేస‌రికి 125 ప‌రుగులు చేసింది.  ఇవి రెండు పురుషుల టి20లో ప్ర‌పంచ రికార్డులు. ట్రావిస్ హెడ్ 32 బంతుల్లో 11ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 89 ప‌రుగులు చేయ‌గా,  మ‌రో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ 12 బంతుల్లో 2ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 46 పరుగులు చేసాడు. వీరిద్ద‌రూ తొలి వికెట్‌కు 131 ప‌రుగులు జోడించారు. అభిషేక్ అవుటైన త‌ర్వాత క్రీజ్‌లోకి వ‌చ్చిన మార్క్‌ర‌మ్ ఒక్క ప‌రుగుకే వెనుదిర‌గ‌గా, లాస్ట్ మ్యాచ్ హీరో క్లాసెన్ 15 ప‌రుగులు చేసి అవుట‌య్యాడు.  ఆ వెంట‌నే హెడ్ కూడా వికెట్ ఇచ్చుకోవ‌డంతో మ్యాచ్ కాసేపు స్లో అయింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నితీశ్‌కుమార్‌రెడ్డి, షాబాజ్ అహ్మ‌ద్‌, అబ్దుల్ స‌మ‌ద్ చెల‌రేగ‌డంతో మ‌ళ్లీ పుంజుకున్న హైద‌రాబాద్ చివ‌రికి 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 266 ప‌రుగులు చేసింది. షాబాజ్ 29 బంతుల్లో 2ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో క‌దం తొక్కి అర్ధ‌సెంచ‌రీ సాధించాడు. హైద‌రాబాద్ 250కి పైగా ప‌రుగులు చేయ‌డం ఇది మూడోసారి.

267 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ఢిల్లీ కూడా ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా, ఓపెన‌ర్లు త్వ‌ర‌గానే పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. కానీ, ఆ త‌ర్వాత వ‌చ్చిన జేక్ ఫ్రేజ‌ర్‌, అభిషేక్ పొరెల్ వీర‌విహారం చేసారు. ముఖ్యంగా ఫ్రేజ‌ర్ 15 బంతుల్లోనే అర్థ‌సెంచ‌రీ సాధించి రికార్డు స్థాపించాడు. ప‌వ‌ర్‌ప్లే ముగిసేస‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 88 ప‌రుగులు చేసిన ఢిల్లీ, 10 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 4 వికెట్ల న‌ష్టానికి 134 ప‌రుగులు చేసింది. కానీ ఒత్తిడిలో ఆడిన ఢిల్లీ త్వ‌ర‌త్వ‌ర‌గా వికెట్లు స‌మ‌ర్పించుకుని స‌రిగ్గా 199 పరుగుల‌కు ఆలౌట్ అయింది. కెప్టెన్ రిష‌భ్ పంత్ చివ‌రికి ఒంట‌రిగా పోరాటం చేసి, 44 ప‌రుగుల‌కు నితిశ్‌కు బ‌లికావ‌డంతో ఢిల్లీ క‌థ ముగిసింది. చివ‌రి నాలుగు వికెట్లూ 199 ప‌రుగ‌ల వ‌ద్దే ప‌డిపోవ‌డం విశేషం.

Latest News