విధాత: ఐపీఎల్ 2025 సీజన్ లో తమను వద్ధనుకున్న సొంత గడ్డ జట్లపై క్రికెటర్లు రెచ్చిపోయి ఆడుతూ వాటి ఓటమిలో కీలక భూమిక పోషిస్తూ ప్రతికారం తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఆటగాళ్లలో సన్ రైజర్స్ వద్ధనుకున్న హైదరాబాదీ సిరాజ్ భాయ్.. బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ పట్టించుకోని కేఎల్ రాహుల్ వంటి వారు ప్రస్తుతం ముందు వరుసలో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడుతున్న సిరాజ్ భాయ్ తాజాగా హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తన హోంగ్రౌండ్ లో బుల్లెట్ బంతులతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కారణమయ్యాడు. అదేవిధంగా అంతకు ముందు మ్యాచ్‌లో తనను వదిలేసిన బెంగళూరుపై సైతం చెలరేగి ఆడడం తెలిసిందే.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుపై గురువారం రాత్రి బెంగుళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు విజయంలో ‘బెంగళూరు’ ప్లేయర్ కేఎల్ రాహుల్ (kl rahul) (93*) కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ లో విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాతా కేఎల్ రాహుల్ చేసుకున్న సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంతారా సినిమాలో హీరో మాదిరిగా బ్యాట్ ను మైదానంపై వలయకారంలో తిప్పి గట్టిగా కొట్టి చేతితో ఈ గడ్డ నా అడ్డా (ఇది నా గ్రౌండ్) అంటూ చేతితో చూపిస్తూ ఛాతి మీద విజయనాదంతో కోపంగా సైగలు చేశాడు. మ్యాచ్ అనంతరం తాను ఇక్కడ చాలా ఏళ్లు క్రికెట్ ఆడినట్లు కేఎల్ వివరణ ఇచ్చాడు. ఇది నాకు సొంత మైదానమని చెప్పుకొచ్చాడు. కేఎల్ కు పిల్లనిచ్చిన మామా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిది మంగళూరు ప్రాంతం కావడం గమనార్హం.
ఆ సైగల వెనుక అసలు కథ పెద్దదే..
బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్ పై కేఎల్ (kl rahul) దూకుడుగా ప్రవర్తించడానికి వెనుక పెద్ధ కథనే ఉందంటున్నారు అభిమానులు. మళ్లీ తన ‘సొంత’ జట్టుకు వద్దామని భావించినా కుదరకపోవడం వల్లే రివేంజ్ తీర్చుకున్నట్లుగా అతని సైగల ఉద్దేశమంటున్నారు. బెంగుళూరు తన హోంగ్రౌండ్ అని.. నన్నే దూరం పెడుతారా అన్నట్లుగా రాహుల్ సైగల అర్ధమని అభిమానులు భావిస్తున్నారు. వాస్తవంగా ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ సొంత జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఏంట్రీ ఇచ్చాడు. 2013-16 సీజన్లలో ఆర్సీబీకి ఆడాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ (2014-15)కు ప్రాతినిధ్యం వహించాడు. పంజాబ్ కింగ్స్ (2018-21), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు (2022-24) సారథిగా వ్యవహరించాడు.
ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్ ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆర్సీబీ తన కెప్టెన్ డుప్లెసిస్‌ను రిటైన్ చేసుకోలేదు. దీంతో స్టార్ బ్యాటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లో ఒకరిని వేలంలో దక్కించుకొని సారథ్యం అప్పగిస్తారని అంతా భావించారు. మరీ ముఖ్యంగా ‘లోకల్ బాయ్’ కేఎల్ రాహుల్‌ని తీసుకుంటారని అంచనా వేశారు. కేఎల్ కూడా తాను ఆర్సీబీకి వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పలు సందర్భాల్లో తన మనసులోని మాట వెల్లడించాడు. కానీ, ఆర్సీబీ మాత్రం కేఎల్‌ను తీసుకోలేదు. బెంగళూరు కెప్టెన్సీని కూడా రజత్ పటీదార్‌కు ఇచ్చింది. అందుకే తనను తిరస్కరించి ఓ రకంగా అవమానించిన ఆర్సీబీ పై గొప్పగా ఆడి సొంత జట్టుకు దూరం చేసిన బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజీపై తన అసహనాన్ని కేఎల్ రాహుల్ మైదానంలో ప్రదర్శించాడని అభిమానులు అంటున్నారు.