Bajrang Punia : ఈ ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న రెజ్లర్ బజరంగ్ పునియా (Bajrang Punia) కు ‘నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA)’ షాకిచ్చింది. డోపింగ్ పరీక్ష కోసం శాంపిల్ అడిగితే నిరాకరించాడనే కారణంతో నాడా అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో మరికొన్ని రోజుల్లో జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌లో బజరంగ్ పాల్గొంటాడా లేదా..? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.
సాధారణంగా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు దేశీయంగా నాడా డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందుకోసం మార్చి 10న బజరంగ్ పునియా నుంచి మూత్ర నమూనాలను కోరగా, ఇచ్చేందుకు ఆయన నిరాకరించాడని నాడా చెబుతోంది. అదే కారణంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునే వరకు ఏ ఈవెంట్లలో పాల్గొనకుండా సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
దాంతో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బజరంగ్.. ఈ నెల జరగనున్న పారిస్ ఒలింపిక్స్ ‘ఎంపిక పరీక్ష’కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో బజరంగ్ పూనియా కూడా పాల్గొన్నాడు. బ్రిజ్‌భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు మహిళా రెజ్లర్‌లు ఆరోపించారు. దాంతో బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాంతో బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
కాగా డోపింగ్ పరీక్ష కోసం శాంపిల్ ఇవ్వలేదంటూ వచ్చిన నివేదికపై బజరంగ్ పునియా స్పందించారు. నాడా అధికారులకు నమూనాలు ఇచ్చేందుకు తాను ఎన్నడూ నిరాకరించలేదని చెప్పారు. తనకు గడువు ముగిసిన టెస్టు కిట్లు ఇచ్చారని, వాటిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో ముందుగా సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే నన్ను పరీక్షించాలని కోరానని తెలిపారు. దీనిపై తన న్యాయవాది త్వరలోనే సమాధానమిస్తారని బజరంగ్ పునియా ఎక్స్‌లో వివరణ ఇచ్చారు.