- నేడే ఇంగ్లండ్‌తో నాలుగో మ్యాచ్
- అండర్–19 సిరీస్‌లో దుమ్మురేపుతున్న టీనేజ్ హీరో
- శుభమన్ గిల్ డబుల్ సెంచరీనే ప్రేరణ
బర్మింగ్‌హామ్, జూలై 6: భారత యువ క్రికెట్‌లో మరో మెరుపు తారకంగా మెరిసిన వైభవ్ సూర్యవంశీ – ఈ 14 ఏళ్ల బాలుడు ఇటీవల ఐపీఎల్‌లో అత్యంత చిన్న వయసులో శతకం సాధించి సంచలనం సృష్టించగా, తాజాగా యూత్ వన్‌డేల్లో ప్రపంచ రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్ అండర్–19పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లో శతకం సాధించి అత్యంత వేగవంతమైన యువ వన్‌డే సెంచరీదారుగా రికార్డు బద్దలు కొట్టాడు.
ఈ విజయంతో ఊరుకునే అలవాటు లేని వైభవ్ … తన తదుపరి లక్ష్యం 200 పరుగులని స్పష్టం చేశాడు. నేడు జూలై 7న వర్సెస్టర్ వేదికగా జరిగే తదుపరి వన్డేలో డబుల్ సెంచరీ చేయాలన్నదే తన సంకల్పమని వెల్లడించాడు.
“పూర్తి 50 ఓవర్లు ఆడాలని నా లక్ష్యం” – వైభవ్
“ఈసారి వంద చేశాను. కానీ తర్వాత మ్యాచ్‌లో రెండు వందలు చేయాలని ప్రయత్నిస్తాను. 50 ఓవర్లూ ఆడాలని నా లక్ష్యం, ఎందుకంటే ఎంత ఎక్కువ పరుగులు చేస్తే, అంత మా జట్టుకు లాభం,” అని బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో వైభవ్ చెప్పాడు.
శుభమన్ గిల్ ఇన్నింగ్స్ నుంచే ప్రేరణ
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌కు హాజరైన వైభవ్, అక్కడే శుభమన్ గిల్ 269 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ చూసి ప్రేరితుడయ్యాడు. “ఆ మ్యాచ్ ప్రత్యక్షంగా చూశాను. సెంచరీ, డబుల్ సెంచరీ చేసాక కూడా గిల్ ఆడుతూనే ఉన్నాడు. అదే నాకు ప్రేరణ ఇచ్చింది,” అని వైభవ్ ఉద్వేగంగా తెలిపాడు.
తన సెంచరీని ప్రపంచ రికార్డుగా గుర్తించకపోయిన వైభవ్, “నేను రికార్డు సృష్టించానని తెలియదు. మా టీం మేనేజర్ అంకిత్ సర్ చెప్పారు. నాకు నిజంగా ఆనందంగా ఉంది,” అని వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో 20 ఓవర్లు మిగిలి ఉండగా తాను ఔటవడం తనకు నిరాశ కలిగించిందని వైభవ్ వివరించాడు. “నేను మినీ గిల్ లా ఎక్కువసేపు ఉండాలి అనుకున్నా. కానీ ఒక షాట్‌ను పూర్తిగా కనెక్ట్ చేయలేక ఔటయ్యాను. లేకపోతే ఇన్నింగ్స్‌ను ఇంకా పొడిగించేవాడిని,” అని విచారం వ్యక్తం చేశాడు.
వైభవ్ భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తోంది
వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం 14 మాత్రమే అయినప్పటికీ, అతని నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, మరియు ఆచరణలో చూపిస్తున్న గంభీరత అతన్ని భవిష్యత్ భారత జాతీయ జట్టుకు గొప్ప ఆశాకిరణంగా నిలబెట్టనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్‌లో శతకం, యూత్ వన్‌డేలో వేగవంతమైన శతకం లాంటి ఘనతలతో వైభవ్ క్రికెట్ ప్రపంచంలో తన పేరు మార్మోగిపోయేలా చేసుకున్నాడు.