Site icon vidhaatha

UEFA EURO 2020: సెమీస్‌లో తలపడేది వీళ్లే!

విధాత:యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో మూడు సార్లు చాంపియన్‌ స్పెయిన్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వార్టర్‌ఫైనల్లో స్పెయిన్‌ పెనాల్టీ షూటౌట్‌లో 3–1తో స్విట్జర్లాండ్‌పై గెలుపొందింది.ఆట 8వ నిమిషంలో డేనిస్‌ జకారియా సెల్ఫ్‌ గోల్‌తో స్పెయిన్‌కు గోల్‌ అందించాడు.

68వ నిమిషంలో స్విట్జర్లాండ్‌ ప్లేయర్‌ షాకిరి గోల్‌ చేయడంతో స్కోర్‌ 1–1తో సమమైంది. నిర్ణీత 90 నిమిషాల సమయంలో ఇరు జట్లు కూడా ఒక్కో గోల్‌ సాధించడంతో మ్యాచ్‌ ఎక్స్‌ట్రా టైమ్‌ (అదనపు సమయం)కు దారి తీసింది. 30 నిమిషాల అదనపు సమయంలో ఇరు జట్లు మరో గోల్‌ సాధించడంలో విఫలమవ్వడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది.ఇక పెనాల్టీ షూటౌట్‌లో ఎటువంటి తడబాటుకు గురవని స్పెయిన్‌ విజేతగా నిలిచింది. మరో పోరులో బెల్జియం, ఇటలీ మధ్య జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో ఇటలీ పైచేయి సాధించింది. బెల్జియంను 2-1 తేడాతో ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. బారెల్లా, ఇన్‌సిగ్నేలు చెరో గోల్‌ సాధించారు. ఇక సెమీస్‌ పోరులో ఇటలీ స్పెయిన్‌లు వెంబ్లే స్టేడియం(లండన్‌)లో తలపడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు చెక్‌ రిపబ్లిక్‌ డెన్మార్క్‌లు తలపడనున్నాయి.

Exit mobile version