Top 5 Cobras | పాముల జాతులలో (snake species) అత్యంత ప్రమాదకారి, ప్రాణాంతకమైనది కోబ్రా (cobra)! భయంతో చూస్తే భయంకరంగా.. ఆసక్తిగా చూస్తే అబ్బురపర్చేలా, అందంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. వాటి పొలుసులు, కదిలే వేగం, బుస కొట్టే తీరు.. చూపరులను ఆకట్టుకుంటాయి. వాటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చూసే వాళ్లే ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటే.. ఇక నేరుగా వాటిని గమనించే అవకాశం వస్తే అపురూపమే. కోబ్రాలు అత్యంత విషపూరితమైన పాములు. అయితే.. ఈ కోబ్రాల్లోనూ పలు జాతులు ఉన్నప్పటికీ.. కొన్ని జాతులు మాత్రం అత్యంత ప్రమాదకరమైనవి (biggest danger). ఇవి ఒక్కో భౌగోళిక ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. జంతు ప్రపంచంలో, కానీ.. మొత్తంగా ప్రపంచంలో కానీ.. ఇతర జంతువులు, మానవులకు అతిపెద్ద ప్రమాదం ఈ కోబ్రాల నుంచే ఉంటుంది. దానితో వాటికి జంతుజాలంలో (fauna) ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ కోబ్రాల్లో ఒక ఐదు అత్యంత ప్రమాదకరమైన కోబ్రా జాతుల (five most dangerous cobra species) గురించి, అవి ఎందుకు అంత ప్రమాదకరమో, వాటి ప్రత్యేకతలేంటో, మిగిలిన కోబ్రాల్లో అవి ఎందుకు విభిన్నమైనవో, ఎక్కడ నివసిస్తాయో తెలుసుకుందాం.
కింగ్ కోబ్రా ప్రపంచంలోనే పొడవైన అతి విషపూరిత పాము. దీని శాస్త్రీయ నామం ఓఫియోఫాగస్ హన్నా. ఇది గరిష్ఠంగా 18 అడుగల వరకూ పెరుగుతుంది. దీని పడగ విభిన్నమైనది. ఏదైనా ముప్పు ఎదురవనుందని అర్థమైతే వెంటనే తన పడగను వెడల్పు చేసి.. అలర్ట్ అవుతుంది. ఈ కోబ్రా జాతి.. దక్షిణ చైనా, దక్షిణాసియా దేశాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీని విషం అత్యంత ప్రమాదకరమైనది. ఒక మధ్యవయస్కుడి శ్వాస కోస వ్యవస్థ స్తంభించిపోవడానికి, పక్షవాతానికి, ఆఖరుకు మరణానికి ఒక్క కాటు చాలు.
నాజే హజే లేదా ఈజిప్షియన్ కోబ్రా.. సన్నగా ఉంటుంది. సుమారు ఆరు అడుగుల పొడవు వరకూ పెరుగుతుంది. దీని భిన్నమైన పడగ ద్వారా దీనిని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ పాము సాధారణంగా ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలతోపాటు, మధ్య ఆసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా నీటి చెలమల వద్ద ఉంటుంది. దీని విషంలో సైటోటాక్సిన్స్‌తోపాటు.. న్యూరోటాక్సిన్స్ కలిసి ఉంటాయి. దీని ప్రభావంతో ఈ పాము కాటు వేసినప్పుడు భరించలేని నొప్పి కలుతుంది. నాడీ వ్యవస్థ ప్రభావితమై మనిషి పక్షవాతానికి గురవుతాడు. సత్వరమే తగిన చికిత్స అందించకపోతే మరణం కూడా సంభవిస్తుంది.
కాస్పియన్ కోబ్రా లేదా నజా అక్సియానా అనే కోబ్రా.. సుమారుగా ఐదు నుంచి ఆరు అడుగుల పొడవు వరకూ పెరుగుతుంది. దీని శరీరం భిన్న రంగుల కలయికగా ఉంటుంది. ఈ జాతి పాము మూలాలు ఉజ్బెకిస్తాన్, ఇరాన్ వంటి మధ్య ఆసియా దేశాల్లో గుర్తించారు. ఇది ఎక్కువగా ఎడారి ప్రాంతాల్లో, కాస్తంత పొడిబారిన ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటుంది. దీని విషం కూడా చాలా ప్రమాదకరమైనది. దీని కాటు పడిన వ్యక్తికి నిర్దిష్ట, సత్వర చికిత్స అందించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది.
మొజాంబిక్ స్పిట్టింగ్ కోబ్రా (నజా మొసాంబికా) సుమారు ఆరు అడుగుల పొడవు వరకూ పెరుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది తన పేరుకు తగినట్టే.. గురి చూసి తన టార్గెట్‌పైకి విషయాన్ని చిమ్మగలుతుంది. సాధారణంగా ఇది ఆఫ్రికా దక్షిణాది దేశాల్లో ప్రత్యేకించి, సవన్నా, గడ్డి నేలల్లో కనిపిస్తుంటుంది. వీటి విష ప్రభావం కంటికి తీవ్ర నష్టాన్ని కలుగచేస్తుంది. తీవ్ర గాయాలకు కారణమవుతుంది. ఇంకో విశేషం ఏంటంటే.. ఇది తనకు ప్రమాదం ఎంత దూరంలో ఉందో గుర్తించేందుకు విషాన్ని చిమ్ముతుందట.
ఇండియన్ కోబ్రా లేదా నజ నజ. దీనినే మన దేశంలో నాగుపాము, త్రాచుపాము అని పిలుస్తారు. నాగుపామును దాని పడగ లోపల వెలుపల విభిన్నత ఆధారంగా ఇట్టే గుర్తుపట్టొచ్చు. ఇది సాధారణంగా నాలుగు నుంచి ఐదు అడుగుల పొడవు వరకూ పెరుగుతుంది. భారతదేశంతోపాటు పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఇది విస్తృతంగా కనిపిస్తుంది. దీని విషం న్యూరోటాక్సిక్. దీని కాటు పడిన వ్యక్తికి శ్వాసకోశ వ్యవస్థ విఫలమవడం సహా అనేక తీవ్ర అనారోగ్యాలు కలుగుతాయి. తగిన చికిత్స అందించకపోతే మరణం కూడా సంభవిస్తుంది.
కోబ్రాలు కూడా మనుషులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయవు. కేవలం తమకు ముప్పు ఉందని భావించినా, లేదా భయపడినా అవి బుసలు కొట్టి మీదకు వస్తాయి. పాములు ప్రకృతి మిత్రులు. ప్రకృతి పదిలంగా ఉండే క్రమంలో అవి తమ వంతు పాత్ర పోషిస్తూ ఉంటాయి. పాములు కనిపిస్తే చంపకండి. అవి నాగుపాములైనా సరే. మీ సమీపంలోని స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇచ్చి, వాటిని రక్షించండి.
ఇవి కూడా చదవండి..
Snake Festival | దేశంలోనే అతిపెద్ద పాముల జాతర..చూసేందుకే భయం
World Snake Day | పాము చెబుతున్న ఆత్మకథ.. జూలై 16 అంతర్జాతీయ పాముల దినోత్సవం
Snakes Love explained | పాముల ప్రేమ నిజమేనా? నాగరాజు, నాగిని అనుబంధంపై మళ్లీ చర్చను రేపిన రెండు పాముల విషాదాంతం!
Snake Bite First Aid | పాము కాటేస్తే చేయాల్సినదేంటి? చేయకూడనిదేంటి?