విధాత సైన్స్ అండ్ టెక్ డెస్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం సరికొత్త విప్లవం సృష్టించబోతోంది. ఇప్పటివరకు గూగుల్, ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఆధిపత్యం ప్రదర్శించిన ఈ విభాగంలో, మెటా (ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ) ఇప్పుడు భారీ ప్రణాళికలతో ముందుకు వస్తోంది. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించిన సూపర్‌క్లస్టర్ ప్రాజెక్టులు సాంకేతిక ప్రపంచాన్ని ఉత్కంఠకు గురి చేస్తున్నాయి.
కృత్రిమ మేధ (Artificial Intelligence – AI) అనేది ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని మార్చేస్తోంది. మనం గూగుల్‌లో ఒక ప్రశ్న టైప్ చేసి సమాధానం కోసం కొంత సమయం వెచ్చించాలి. కానీ చాట్‌జీపీటీ, బార్డ్, డీప్‌సీక్ వంటి AI యాప్స్ కేవలం కొన్ని సెకన్లలోనే మనకు సమాధానం ఇస్తాయి. ఇవి ఇంత వేగంగా పనిచేయడానికి కారణం వీటి వెనుక ఉన్న శక్తివంతమైన గణన వ్యవస్థలు. ఈ వ్యవస్థలను మరింత శక్తివంతంగా చేసేందుకు, మెటా (ఫేస్‌బుక్ యజమాన్య సంస్థ) సూపర్ డేటా సెంటర్లను నిర్మిస్తోంది.
మెటా AI సూపర్క్లస్టర్లు – ప్రొమెథియస్ మరియు హైపరియన్
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటనల ప్రకారం, మొదటి సూపర్‌క్లస్టర్ పేరు ప్రొమెథియస్(). ఇది 2026 నాటికి ఉపయోగంలోకి రానుంది. దీని శక్తి సామర్థ్యం 1341 మెగావాట్లు. అర్థం అయ్యేలా చెప్పాలంటే, ఈ డేటా సెంటర్ ఒకేసారి 1.8 కోట్ల సీలింగ్ ఫ్యాన్లు నడిచేంత విద్యుత్‌ను ఉపయోగిస్తుంది. దీనికి తరువాత మరింత భారీగా హైపరియన్() సూపర్‌క్లస్టర్‌ను నిర్మిస్తున్నారు. ఇది ప్రొమెథియస్ కంటే ఐదు రెట్లు శక్తివంతమై 5 గిగావాట్ల విద్యుత్ శక్తిని వినియోగించగలదు. ఇది మాన్‌హాటన్ నగరాన్ని కవర్ చేసేంత విస్తారంగా ఉంటుందని జుకర్‌బర్గ్ చెప్పారు.
ఎందుకు ఈ సూపర్క్లస్టర్లు?
AI మోడళ్లను మరింత తెలివిగా మార్చడానికి వీటికి శిక్షణ అందించాలి. ఉదాహరణకు, ChatGPT లాంటి మోడల్‌ను ఉపయోగించడానికి ముందు దాంతో లక్షల కోట్ల సమాచారం ఉన్న పేజీలు చదివించి, వాటిని అర్థం చేసుకునే శిక్షణ ఇవ్వాలి. ఈ శిక్షణ కోసం సాధారణ కంప్యూటర్లు చాలవు. అందుకే సూపర్‌క్లస్టర్లు అవసరం అవుతాయి. డీప్‌సీక్ ఎఐ శిక్షణకు 12-14 మెగావాట్లు అవసరం అయితే, చాట్‌జీపీటీకి 300-500 మెగావాట్ల శక్తి అవసరమవుతోంది. ఇక 1341 మెగావాట్ల ప్రొమెథియస్, 5 గిగావాట్ల హైపరియన్ వంటి క్లస్టర్లు ఉంటే AI రంగంలో ఎంత విప్లవం సృష్టించగలవో అర్థం చేసుకోవచ్చు.
భారీ పెట్టుబడులు, మేధావుల వేట
మెటా ఈ ప్రాజెక్టులకు వందల బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. స్కేల్ ఏఐ() సంస్థతో 14 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.2 లక్షల కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. కృత్రిమమేధ రంగంలో ప్రముఖులైన ఇంజనీర్లను ఆకర్షించడానికి రూ.850 కోట్ల నుండి 2500 కోట్ల వరకు జీతం ప్యాకేజీలు ఆఫర్ చేస్తోంది. గిట్‌హబ్() మాజీ సీఈఓ నాట్ ఫ్రెడ్‌మన్, స్కేల్ ఏఐ సీఈఓ అలెగ్జాండర్ వాంగ్ వంటి ప్రముఖులను ఇప్పటికే నియమించుకుంది. యాపిల్, గూగుల్, ఓపెన్‌ఏఐ వంటి సంస్థల నుండి కూడా ప్రతిభావంతులైన నిపుణులకు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇవ్వజూపుతోంది.
అత్యాధునిక హార్డ్వేర్
ఈ సూపర్‌క్లస్టర్లలో ఎన్విడియా(NVIDIA) H100 GPUsతో 24,వేలకు పైగా శక్తివంతమైన యూనిట్లు అమర్చబడ్డాయి. ఇవి లామా 3 వంటి కొత్త ఎఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడంలో సహాయపడతాయి. మెటా అభివృద్ధి చేసిన గ్రాండ్ టెటాన్(Grand Teton) అనే ప్రత్యేక హార్డ్‌వేర్ ప్లాట్‌ఫామ్‌తో ఈ సూపర్‌క్లస్టర్లు నిర్మించబడ్డాయి. హ్యామర్‌స్పేస్, టెక్టానిక్ వంటి డేటా స్టోరేజ్ సిస్టమ్‌లు సమాచారాన్ని శరవేగంగా బదిలీ చేయడం, కృత్రిమమేధ శిక్షణ కోసం భారీ సమాచరాన్ని నిల్వచేయడం కోసం ఉపయోగపడుతున్నాయి.
విద్యుత్ వినియోగం, ప్రభావం
ఈ సూపర్‌క్లస్టర్ల వల్ల విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ప్రొమెథియస్ క్లస్టర్ యొక్క 1341 మెగావాట్ల శక్తి అంటే ఒకేసారి 1.34 కోట్ల టీవీలు ఆన్ చేసి చూడగలిగేంత విద్యుత్తు. హైపరియన్ ఐదు రెట్లు ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. నిపుణుల అంచనా ప్రకారం, 2030 నాటికి అమెరికా మొత్తం విద్యుత్ వినియోగంలో 20% వరకు కేవలం డేటాసెంటర్లకే సరిపోతుంది. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే నీరు మరియు విద్యుత్ సరఫరా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
కృత్రిమమేధ భవిష్యత్తు దిశగా మెటా
జుకర్‌బర్గ్ మాటల ప్రకారం, ఈ ప్రాజెక్టులు కేవలం ఏఐ పరిశోధనలకు మాత్రమే కాకుండా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి యాప్స్‌లో కొత్త ఫీచర్లను అందించడంలో, స్మార్ట్ డివైసులు తయారు చేయడంలో, ప్రకటనల రూపకల్పనలో విప్లవాత్మక మార్పులను తెస్తాయి. మెటా సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్(Meta Superintelligence Labs) ద్వారా ఈ సూపర్‌క్లస్టర్లు ఏజీఐ (Artificial General Intelligence) అనే భవిష్యత్ లక్ష్యం సాధించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం ఈ ప్రాజెక్టులపై ఉత్కంఠగా దృష్టి సారించింది. ఓపెన్‌ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలపై ఈ మెటా భారీ ప్రాజెక్టులు భారీ ఆధిపత్యాన్ని చలాయిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Categories : Business News, Science & Tech News.