civil supplies department | పౌరసరఫరాల శాఖలో 1100 కోట్ల కుంభకోణం

తెలంగాణ పౌరసరఫరాల శాఖలో దొడ్డు ధాన్యం లిఫ్టింగ్‌..సన్న బియ్యం సేకరణ ముసుగులో 1100కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడిందని దీనిపై తక్షణం ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు సమాధానం చెప్పాలని, సిటింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

  • Publish Date - May 26, 2024 / 04:41 PM IST

నిబంధనలను ఉల్లంఘించిన టెండర్ సంస్థలు
మనీలాండరింగ్‌తో మిల్లర్ల వద్ద నుంచి 700కోట్ల వసూళ్లు
సన్న బియ్యం సేకరణతో మరో 300కోట్ల వసూళ్లు
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
సిటింగ్ జడ్జీతో విచారణకు డిమాండ్‌
ఈడీ, సీబీఐలకు ఎఫ్‌సీఐ ఫిర్యాదు చేయాలి
లేదంటే న్యాయ.. ప్రజాపోరాటాలు

విధాత : తెలంగాణ పౌరసరఫరాల శాఖలో దొడ్డు ధాన్యం లిఫ్టింగ్‌..సన్న బియ్యం సేకరణ ముసుగులో 1100కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడిందని దీనిపై తక్షణం ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు సమాధానం చెప్పాలని, సిటింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖలో జరిగిన కుంభకోణాల వివరాలను వెల్లడించారు.

కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అని మేం చెప్పినట్లుగానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన 50రోజుల్లోనే 1100కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. రైతన్నల ధాన్యం నుంచి.. విద్యార్థుల అన్నం వరకు అన్నింటా కాంగ్రెస్ పాలకులు కుంభకోణాలు చేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు ఫ్రక్రియపై పూర్తి కాక రైతులు రోజుల తరబడిగా ఇబ్బందిపడుతుంటే దానిపై దృష్టి పెట్టకుండా ధాన్యం, బియ్యం స్కామ్‌కు పాల్పడటం విడ్డూరమన్నారు.

కాంగ్రెస్ పెద్దలు తమ జేబులు నింపుకోవడానికి, ఢిల్లీకి కప్పం కట్టేందుకు పౌరసరఫరాల శాఖలో గ్లోబల్ టెండర్ల పేరుతో ఒకే రోజు జనవరి 25న టెండర్లకు కమిటీ వేసి, అదే రోజు గైడ్‌లైన్స్ జారీ చేసి, టెండర్లను జెడ్ స్పీడ్‌లో ఫైనల్ చేశారన్నారు. అదే రైతులకు అధికారంలోకి రాగానే చేస్తామన్న 2లక్షల రుణమాఫీకి, 1కోటి 67లక్షల మంది మహిళలకు ఇస్తామన్న 2,500రూపాయలకు, 46లక్షల మంది వృద్ధులు, వితంతువులకు ఇస్తామన్న 4వేల పింఛన్‌, 15వేల రైతుభరోసాకు సంబంధించి ప్రజల జేబులు నింపే ఫైళ్లు మాత్రం ఎక్కడున్నవి అక్కడే ఉన్నాయని ఎద్దేవా చేశారు.

తక్కువ ధరకే ధాన్యం..ఎక్కువ ధరకు సన్న బియ్యం టెండర్లు

పౌరసరఫరాల శాఖ బీఆరెస్ హయాంలో సేకరించిన 35లక్షల టన్నుల ధాన్యం లిఫ్టు చేసే పేరుతో మూడు నెలల క్రితం గ్లోబల్ టెండర్ల ద్వారా 750కోట్లు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం సేకరణ పేరుతో 300కోట్ల కుంభకోణాలకు పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు. మిల్లర్లు స్వయంగా 2,100రూపాయలకు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి ఇన్సెంట్ ఇస్తే, దానిని తిరస్కరించి గ్లోబల్ టెండర్ల పేరిట ప్రత్యేక నిబంధనలు పెట్టి, చిన్న రైసు మిల్లర్లను పక్కన పెట్టి, నాలుగు కంపనీలకు ధాన్యం లిఫ్టింగ్‌, సన్న బియ్యం సరఫరా అప్పగించడం జరిగిందన్నారు.

2023సంవత్సరంలో బీఆరెస్ హయాంలో గురుకులాల్లో సన్న బియ్యం సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో బ్లాక్ లిస్టులో పెట్టిన కేంద్రీయ బండారు సంస్థకు, కాంగ్రెస్‌ ప్రభుత్వం నిబంధనలు సవరించి మరి గ్లోబల్ టెండర్లు కట్టబెట్టారన్నారు. మిల్లర్లు 2100లకు కొనుగోలు చేస్తామని చెప్పినా పట్టించుకోకుండా 1885నుంచి 2007రూపాయలవరకు దాదాపు 200తగ్గించి నాలుగు సంస్థలకు కట్టబెట్టిందన్నారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు 90రోజులలో 35వేల మెట్రిక్ టన్నుల ధాన్యం లిఫ్టింగ్ చేయాలని, ప్రభుత్వానికి 750కోట్లు కట్టాలని పేర్కోన్నారు. కాని కాంట్రాక్టు సంస్థలు మాత్రం టెండర్ నిబంధనలకు విరుద్దంగా మిల్లర్లతో నేరుగా ఆర్ధిక పరమైన లావాదేవిలతో మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయని కేటీఆర్ వెల్లడించారు.

4వేలమంది మిల్లర్లను బెదిరిస్తూ గోదాంలలోని ధాన్యం తీసుకపోకుండా 2230రూపాయలు చెల్లించాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. జలసౌధలో ఆనాడు జరిగిన సమావేశంలో సీఎం పేషీకి, ఢిల్లీకి డబ్బులు పోవాలి..ఎన్నికలున్నాయన్న కారణాలతో 200రూపాయలు అదనంగా చెల్లించాలని మిల్లర్లతో నాలుగు సంస్థలు బెదిరించి ఎంవోయు కుదుర్చుకున్నాయన్నారు. ఇందుకు ప్రతిఫలంగా మిల్లర్లు ధాన్యం లిఫ్టు చేయకపోయినా చేసినట్లుగా, ధాన్యం లేకపోయినా ఉన్నట్లుగా చూపిస్తామని ఆఫర్ ఇచ్చారని, కేవలం మీరు 200రూపాయలు అదనంగా ఇస్తే చాలని మిల్లర్లకు చెప్పారన్నారు. చెప్పినట్లుగా వినకపోతే విజిలెన్స్ దాడులు జరుగుతాయని మిల్లర్లను బెదిరిస్తున్నారన్నారు.

35 లక్షల మెట్రిక్ టన్నులకు 200రూపాయలు చొప్పున 700కోట్లను మనీలాండరింగ్ ద్వారా వసూలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వంతో నేరుగా సంబంధం లేని ప్రైవేటు సంస్థలు ప్రభుత్వం తరుపునా మిల్లర్ల నుంచి 700కోట్లు వసూలు చేసి మనీలాండరింగ్ నేరానికి పాల్పడ్డాయన్నారు. కాంట్రాక్టు సంస్థల నుంచి 700కోట్లు ప్రభుత్వ పెద్దలకు ముడుతున్నందునే ఆ సంస్థలు టెండర్ నిబంధనల మేరకు 90రోజుల్లో ధాన్యం లిఫ్టు చేయకపోయినా, డబ్బులు కట్టకపోయినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, వారికే మరింత గడువు పొడగించేందుకు సిద్ధమవుతుందని కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు.

మిల్లర్లు, కాంట్రాక్టు సంస్థల నుంచి రావాల్సిన 700కోట్లు రాలేదని చెప్పి వారికి గడువు పొడిగింపు చేస్తున్నారని, మిల్లర్ల నుంచి ఆ డబ్బులు వచ్చేదాకా బెదిరించి వసూలు చేసేదాకా పొడగింపు చేస్తారని ఆరోపించారు. మిల్లర్ల దగ్గర ధాన్యం ఖాళీ చేయకపోతే తదుపరి సీజన్ లేవి సేకరణ ఇబ్బందిలో పడుతుందని, 150కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు.

సన్న బియ్యంతో మరో స్కామ్‌

పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్లలో రెండో స్కామ్ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సన్న బియ్యం సేకరణ టెండర్ ఒకటని కేటీఆర్ ఆరోపించారు. 2లక్షల 22వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కావాలని చెప్పి పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్లు పిలిచి అదే నాలుగు సంస్థలకు టెండర్లు కట్టబెట్టిందన్నారు. బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం ధర కిలో 42రూపాయలకు దొరుకుతుండటం..మిల్లర్లు సైతం ఆ ధరకు ఇస్తామని చెప్పినా పట్టించుకోకుండా కిలో సగటున 57రూపాయలకు కోడ్ చేసిన సంస్థలకు అధిక ధరకు టెండర్లు ఇచ్చారన్నారు. ఇందులో 2లక్షల 22వేల టన్నులకు అదనంగా 15రూపాయల చొప్పున 300కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు.

వాస్తవానికి బీఆరెస్ హయాంలో సేకరించిన 1.6లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉందని, దాన్ని మిల్లింగ్ చేయకుండా 22.50రూపాయలకు అమ్మేసి.. బయట 57రూపాయలకు సన్న బియ్యం కొనుగోలు చేశారన్నారు. కాంట్రాక్టు సంస్థలతో మిలాఖత్ అయ్యి.. మిల్లర్ల మెడపైకత్తి పెట్టి 1100కోట్ల రూపాయల స్కామ్ చేశారన్నారు. ఇందులో ప్రభుత్వం నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టాన్ని సైతం ఉల్లంఘించి సన్న బియ్యం అధిక ధరకు కొనుగోలు చేసిందని ఆరోపించారు. గతంలో బీఆరెస్ ప్రభుత్వం విద్యార్థులకు సన్న బియ్యం కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్న ధాన్యం సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా రాష్ట్ర కోటాలో వాడుకున్నామని, ఒకవేళ సన్న ధాన్యం తక్కువ వస్తే దొడ్డు ధాన్యం మిల్లర్లకు ఇచ్చి, క్వింటాల్‌కు 140 ఇచ్చామన్నారు. కాంగ్రెస్ మాత్రం సివిల్ సఫ్లయ్ కార్పోరేషన్‌ను కామధేనువుగా, కల్పవృక్షంగా వాడుకుందన్నారు.

కేంద్రం పాత్రపై అనుమానాలు

పౌరసరఫరాల శాఖ కుంభకోణంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాత్ర తో పాటు ఎఫ్‌సీఐ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమేయం కూడా ఉందని తాము ఆరోపిస్తున్నామని కేటీఆర్ పేర్కోన్నారు. ఎందుకంటే ధాన్యం సేకరణ వ్యవహారమంతా ఎఫ్‌సీఐ ఆధీనంలోనే సాగుతుందని, ఒకవైపు బీజేపీకి చెందిన శాసన సభ పక్ష నేత పౌరసరఫరాల శాఖలో 1100కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తుండగా, కేంద్రం పరిధిలోని ఎఫ్‌సీఐ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీని వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు.

టెండర్ నిబంధనల మేరకు ప్రభుత్వం 90రోజుల్లోగా ధాన్యం లిఫ్టు చేయని సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టాలని, వాటి టెండర్లు రద్దు చేయాలని, వాటికి గడువు పొడిగించరాదని తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, ఈ స్కామ్‌లపై సీఎం రేంవత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌లు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే మనీలాండరింగ్‌పై ఎఫ్‌సీఐ వెంటనే ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

కాళేశ్వరం, విద్యుత్తు ఫ్లాంట్లు, విద్యుత్తు కొనుగోలుపై సిటింగ్ జడ్జీలతో విచారణ కమిటీలు వేసిన సీఎం రేవంత్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ కుంభకోణంపై సిటింగ్ జడ్జీతో విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తామని, ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. కుంభకోణాలను ప్రజల ముందు పెడుతామని, ప్రజాక్షేత్రంలో వదలిపెట్టబోమన్నారు. విచారణకు ఆదేశిస్తే లేని ధాన్యానికి టెండర్లు పెట్టిన వైనం కూడా బయటకు వస్తుందన్నారు.

Latest News