విద్యా వ్యవస్థ బలోపేతానికి 22 వేల కోట్ల బడ్జెట్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని, విద్యావ్యవస్థ బలోపేతానికి 22వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం ద్వారా మౌలిక వసతుల కల్పన, మెరుగైన విద్యా బోధన అందించే దిశగా చర్యలు చేపట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

  • Publish Date - June 15, 2024 / 06:11 PM IST

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6 వేల పాఠశాలలు మూసివేత
600 కోట్లతో అన్ని పాఠశాలను మోడల్ స్కూల్స్ గా మార్పు
బడి బాటలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

విధాత : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని, విద్యావ్యవస్థ బలోపేతానికి 22వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం ద్వారా మౌలిక వసతుల కల్పన, మెరుగైన విద్యా బోధన అందించే దిశగా చర్యలు చేపట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. శనివారం నూతనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆచార్య జయ శంకర్ సర్ బడిబాట కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్యానందించాలన్న లక్ష్యంతో దశల వారిగా రూ. 600 కోట్లతో అన్ని పాఠశాలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6 వేల పాఠశాలలు మూసివేయడం జరిగిందని విమర్శించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కార్పోరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించి పిల్లలకు బంగారు భవిష్యత్ కల్పించాలని సూచించారు. నూతనకల్ పాఠశాలలకు 10 కంప్యూటర్లు అందిస్తామని, మరుగుదొడ్లు నిర్మాణానికి రూ. 10 లక్షలు అందించనున్నట్లు తెలిపారు.

అన్ని హామీలు నెరవేరుస్తాం

రాష్ట్రంలో అభయ హస్తంలో ఉన్న అన్ని పథకాలు అర్హులందరికీ అందిస్తామని, అలాగే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15 నాటికి చెల్లిస్తామని స్పష్టం చేశారు. హామీలన్నింటిని అమలు చేస్తూ ముందుకెలుతామన్నారు. ఇందిరమ్మ ఇండ్లను నియోజక వర్గాల వారీగా పేదలైన అర్హులకు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పాత రోడ్లకు రూ. 75 కోట్లతో మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని అలాగే రెండు సంవత్సరాల్లో కొత్త రోడ్ల నిర్మాణం చెప్పట్ట నున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాంతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లిఫ్టులు చేపట్టి వ్యవసాయ రంగానికి సాగునీరు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు..

భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అలాగే విద్యకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యానందించేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 536 అమ్మ ఆదర్శ పాఠశాలలో 336 గుర్తించిన పనులను పూర్తి చేయడం జరిగిందని అలాగే మిగిలిన పాఠశాలలో పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక, పి.డి. మధుసూదన రాజు, డి.ఈ. ఓ అశోక్, డి.పి.ఓ సురేష్ కుమార్, ఆర్ అండ్ బి ఈ ఈ భాస్కర్ రావు, డిడబ్ల్యువో వెంకట రమణ, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ కె. దామోదర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.

Latest News