చనిపోయిన మేకలతో మున్సిపాలిటీ ఎదుట ధర్నా

వీధి కుక్కల దాడిలో చనిపోయిన తన మేకలతో ఓ వ్యక్తి ఏకంగా మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసనకు దిగిన ఘటన వైరల్‌గా మారింది.

  • Publish Date - May 15, 2024 / 03:29 PM IST

కుక్కల బెడద తొలగించాలని బాధితుడి నిరసన

విధాత: వీధి కుక్కల దాడిలో చనిపోయిన తన మేకలతో ఓ వ్యక్తి ఏకంగా మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసనకు దిగిన ఘటన వైరల్‌గా మారింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో అజీజుద్దీన్ ఫైజాన్ అనే వ్యక్తి పెంచుకుంటున్న మేకలను వీధి కుక్కల దాడి చేసి చంపేశాయి. ఈ ఘటనతో ఆర్థికంకా నష్టపోయిన అజీజుద్ధిన్‌ చనిపోయిన మేకలను తీసుకుని బుధవారం ఏకంగా మున్సిపల్ ఆఫీసు ముందు నిరసనకు దిగాడు. అధికారులువీధి కుక్కలను నిర్మూలించి తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశాడు.

గత ఏడాది రెండు మేకలను, ఫిబ్రవరిలో ఆరు మేకలను చంపేశాయని..ఈ సమస్యపై తాను మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తే స్పందించకపోగా, నీ ప్రహారి గోడ సరిగా లేదన్నారని, దీంతో ఐదు ఫీట్ల ప్రహారీని తొమ్మిది ఫీట్లకు పెంచుకున్నానని, అయినా ఈ రోజు ఎనిమిది కుక్కలు లోపలికి దూకి నాలుగు మేకలను చంపేశాయని, దీంతో తాను ఆర్ధికంగా నష్టపోవాల్సివచ్చిందని వాపోయాడు. వీధి కుక్కల నివారణపై ఆర్టీఐ కింద వివరాలు కోరినా తాము వీధి కుక్కల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ మున్సిపల్‌ అధికారులు సమాధానమిచ్చారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఉన్నతాధికారులు ఈ సమస్యపై స్పందించి వీధి కుక్కల బెడద నుంచి పట్టణ వాసులను, జీవాలను కాపాడలని డిమాండ్‌ చేశారు.

Latest News