విధాత : రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. భూపాల్ రెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు . భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షల నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు . భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మధన్ మోహన్ ను అరెస్ట్ చేశారు. ధరణి నిషేధిత జాబితాలో ఉన్న 14 గుంటల భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ముందుగా బాధితుడి నుంచి ఎనిమిది లక్షలను సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ కారులో ఉండి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అయితే జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే డబ్బులు తీసుకుంటున్నట్లు మధన్ మోహన్ ఏసీబీ అధికారులకు చెప్పాడు. ఏసీబీ అధికారుల ముందే జేసి భూపాల్ రెడ్డికి మధన్ మోహన్ ఫోన్ చేయగా.. లంచం డబ్బులను పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ దగ్గరకు తేవాలని భూపాల్ రెడ్డి సూచించారు . దీంతో సీనియర్ అసిస్టెంట్ మధన్ మోహన్ ఎనిమిది లక్షలు తీసుకొని ఓఆర్ఆర్ వద్ద భూపాల్ రెడ్డి ని కలిశాడు. మధన్ మోహన్ నుంచి లంచం డబ్బులు తీసుకుని భూపాల్ రెడ్డి తన కారులో పెట్టుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. భూపాల్ రెడ్డి నివాసంలో.. ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.