విధాత : తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎన్‌ఎస్‌యుఐ నేత బల్మూరీ వెంకట్‌ల అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ అధికార ప్రకటన విడుదల చేశారు. రేపు గురువారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో వారిద్ధరు ఉదయం 11 గంటలకు తమ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వారికి బీఫామ్‌ల జారీ.. నామినేషన్ల దాఖలు బాధ్యతను సీనియర్ నేత టి.జగ్గారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించింది.
ఎమ్మెల్సీల అభ్యర్థుల పేర్ల వెల్లడి ముందుకు వరకు కూడా బల్మూరి వెంకట్‌తో పాటు అద్దంకి దయాకర్ పేరు ప్రచారంలో ఉంది. చివరకు అధికారిక ప్రకటనలో మాత్రం అద్దంకి స్థానంలో మహేశ్‌కుమార్ గౌడ్ పేరును ఖరారు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ అద్దంకికి షాక్ నిచ్చింది. అనూహ్యంగా చివరి నిమిషంలో అద్దంకి పేరు జాబితాలో గల్లంతు కావడానికి కారణాలెమిటన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి తుంగతుర్తి(ఎస్సీ) రిజర్వ్‌డ్ టికెట్‌ను ఆశించిన సందర్భంలో ఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చాకా తగిన గుర్తింపు నిస్తామని చెప్పి బుజ్జగించారు. నిన్నటి వరకు ఎమ్మెల్సీ జాబితాలో ఆయన పేరు వినిపించినా చివరకు సామాజిక సమీకరణల నేపధ్యంలో మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అవకాశం కల్పించినట్లుగా పార్టీ వర్గాల సమాచారం. అద్దంకి, మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరీతో పాటు చిన్నారెడ్డి, హర్కరి వేణుగోపాల్, పటేల్ రమేశ్‌రెడ్డి పేర్లు కూడా బలంగా వినిపించినా చివరకు మహేశ్‌కుమార్‌గౌడ్, వెంకట్‌లకే ఎమ్మెల్సీల భాగ్యం దక్కింది.ఎమ్మెల్సీ స్థానాల ప్రకటనపై అద్దంకి దయాకర్ స్పందిస్తూ నేను కాంగ్రెస్ పార్టీకి విధేయుడునని, పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, పార్టీ కొరకు సహనంగా ఉంటానన్నారు. నాకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుందని భావిస్తున్నానని, నా పట్ల కేంద్ర, రాష్ట్ర పార్టీ నాయకత్వం సానుకూలంగా ఉందన్నారు. ఇకపోతే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించాల్సివుంది. అలాగే నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సివుండటంతో వాటి ద్వారా మరికొందరు ఆశావహులకు పదవులు దక్కనున్నాయి.
కృషికి దక్కిన గుర్తింపు
మెడిసిన్(ఎంబీబీఎస్) చదివిన బల్మూరీ వెంకట్ పూర్తి పేరు బల్మూరీ వెంకట్ నర్సింగ్‌రావు. 1992లో జన్మించిన వెంకట్ ఎన్‌ఎస్‌యుఐ నేతగా పలు విద్యార్థి పోరాటాల్లో కాంగ్రెస్ నుంచి కీలక భూమిక పోషించారు. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడారు. రేవంత్‌రెడ్డి అనుచరుడిగా పేరొందిన వెంకట్‌పై గత బీఆరెస్ సర్కార్ అనేక కేసులు సైతం నమోదు చేసింది. గత ఏడాది టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీలపై క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష పోరాటాలతో పాటు న్యాయపరమైన పోరాటం కూడా సాగించారు. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ సైతం పార్టీకి విధేయతతో అందించిన సేవలకు అధిష్టానం నుంచి తగిన గుర్తింపు దక్కిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కోన్నాయి. సామాజిక సమీకరణల్లో భాగంగా మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.