Site icon vidhaatha

సింగరేణిలో ఏఐటీయూసీదే విజయం

విధాత : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ విజయం సాధించింది. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ తో జరిగిన ముఖాముఖి పోరులో 2007 ఓట్లు మెజారిటీతో ఏఐటీయూసీ విజయం సాధించింది. 39,773 మంది ఓటర్లలో 37,468 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 16175 ఓట్లు ఏఐటీయూసీకి 14168 ఓట్లు ఐఎన్టీయూసీకి, పోలయ్యాయి. దీంతో 2007 ఓట్ల మెజారిటీతో ఏఐటీయూసీ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా విజయపతాక ఎగురవేసింది.

11 డివిజన్లలో ఐఎన్ టీయూసీ ఆరు గెలిచినప్పటికీ.. ఏఐటీయూసీ గెలిచిన ఐదు డివిజన్లతో పాటు అన్ని డివిజన్ లలో కలిపి సాధించిన ఓట్ల సంఖ్య ఐఎన్టీయూసీ కంటే ఎక్కువగా ఉండడంతో ఎన్నికల్లో గుర్తింపు కార్మిక సంఘం గా ఏఐటీయూసీ విజయం సాధించింది.

డివిజన్ల వారిగా చూస్తే రామగుండం ఒకటి, రామగుండం 2, శ్రీరాంపూర్ మందమర్రి, బెల్లంపల్లి డివిజన్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం 3, మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, భూపాలపల్లిలలో ఐ ఎన్ టీ యూ సీ విజయం సాధించింది. మణుగూరులో ఏఐటీయూసీ పై ఐఎన్ టీయూసీ కేవలం రెండు ఓట్ల తేడాతో మాత్రమే గెలుపొందడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోని నాలుగు డివిజన్లలో ఐ ఎన్ టీయూసీనే గెలుపొందింది. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన టీబీజీకేఎస్ నామ మాత్ర పోటీకే పరిమితమైంది. కొన్ని డివిజన్లో సున్నా ఓట్లు రాగా, మరికొన్ని డివిజన్లలో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.

Exit mobile version