- ప్రజలకు పిలుపు ఇచ్చిన పౌర సమాజం
- బీఆరెస్ 10 ఏళ్ల విధ్వంసానికి దన్నుగా బీజేపీ
- బీఆరెస్+బీజేపీ= బీఆర్ ఎస్ ఎస్
- లిక్కర్-నిక్కర్ పార్టీలు ఒక్కటయ్యాయి
- సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి
- మూడవ సారి బీఆరెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వ నాశనం
- రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి
విధాత, హైదరాబాద్: బీఆరెస్ చేసిన 10 ఏళ్ల విధ్వంసానికి బీజేపీ వెన్నుదన్నుగా ఉందని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ పౌర సమాజ వేదికలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నది బీఆరెస్ ఒక్కటే కాదని, బీఆరెస్, బీజీపీ కలిసి బీఆర్ ఎస్ ఎస్ గా మారి పాలన కొనసాగిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రానికి ఇన్ని సార్లు వచ్చిన మోడీ మేడిగడ్డ పేరు ప్రస్తావించలేదన్నారు. పైగా అనుమతి ఇచ్చింది బీజేపీనే అనిఅన్నారు. లిక్కర్ స్కామ్ ఏమైందో అందరికి తెలుసు కదా అని అన్న పాశం యాదగిరి లిక్కర్- నిక్కర్ పార్టీలు ఒక్కటయ్యాయన్నారు.
రాష్ట్రంలో నిరంకుశ, ప్రజా వ్యతిరేక దోపిడి పాలన కొనసాగిస్తున్న బీఆరెస్‌ను వ్యతిరేకిద్దామని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. దేశ రాజ్యాంగాన్ని కాలరాస్తూ విద్వేశాలు రెచ్చగొడుతున్న బీజేపీని అడ్డుకుందామని పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో పాలకులకు గుణ పాఠం చెప్పే విధంగా ఓటును వాడుకుందామని పిలుపు ఇచ్చారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ మూడవ సారి బీఆరెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు అవినీతి, అబద్దాలు, అసమర్థుల అహంకార పూరిత పాలన కొనసాగుతుందని ఆరోపించారు. కేజీ టూ పీజీ ఒక అబద్దమన్నారు. రైతు బంధు డబ్బులు రైతులు కాని వారికి పంచి పెట్టాడని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ ప్రజలను, మంత్రులను, బ్యూరోక్రాట్లను, ఇంజనీర్లు ఎవరిని కలువడని ఒకవేళ కలిసినా ఎవరి మాట వినడన్నారు. ఇలా ఎవరి మాట వినకుండా లక్ష కోట్ల రూపాయలు ఆగం చేశాడనడానికి మంచి ఉదహారణ కాళేశ్వరం అని తెలిపాడు. సీఎం కేసీఆర్ తాను ఎమ్మెల్యేగా సరిగ్గా పని చేయలేదని గజ్వెల్ ప్రజలను క్షమాపణ కోరాడన్నారు. గజ్వెల్ కంటే రాష్ట్రాన్ని దారుణంగా చేసినందుకు గజ్వెల్ తీరుగా రాష్ట్ర మొత్తానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కులేదన్నారు. ఇంతలా మసి పూసి మారేడుకాయ చేసే రాజకీయ నాయకుడిని ఎక్కడా చూడలేదన్నారు. మోస పూరిత స్కీమ్‌లు పెట్టి ఆశ చూపిస్తడు కానీ ఇవ్వడని ఆరోపించారు. దళితబంధుకు రూ.17,600 కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదన్నారు. బీసీలకు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఇవ్వలేదని తెలిపాడు.
ఉప ఎన్నికలు వస్తే స్కీమ్‌లకు ప్రిపేర్ అవుతడని, ఓట్లను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తడు కానీ ఒక నిజమైన పరిపాలన చేయడని ఆరోపించారు. మూడవ సారి బీఆరెస్ అధికారంలోకి వస్తే 35 లక్షల మంది నిరుద్యోగులు, 45 లక్షల మంది చిన్నకారురైతులు, 22 లక్షల మంది కౌలు రైతులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మీద ఆశలుపెట్టుకున్న 28 లక్షల మంది గోస పడుతరన్నారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే 60 లక్షల మంది పిల్లల తల్లిదండ్రులు గోస పడుతరన్నారు.
మోడీ కూడా ఇదే విధంగా అబద్దాల పాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. దేశంలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదన్నారు. ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో తీసుకువెళ్లి ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో సుప్రీం కోర్టు న్యాయవాది నిరూప్‌రెడ్డి, ప్రొఫెసర్ పద్మజ, డాక్టర్ గోపీనాథ్, కన్నెగంటి రవి, అంబటి నాగయ్య, చందర్, సాధిక్ అలీ తదితరులు పాల్గొన్నారు.