Anjan Kumar Yadav | ఫలించిన బుజ్జగింపులు..అలక పాన్పు దిగిన అంజన్ కుమార్ యాదవ్

జూబ్లీహిల్స్ టికెట్ దక్కక అలకబూనిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బుజ్జగింపులతో మెత్తపడ్డారు. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం పనిచేయడానికి అంగీకరించారు.

Anjan Kumar Yadav

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడి అసమ్మతి గళమెత్తుకున్న మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఎట్టకేలకు చల్లబడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లోకల్ – నాన్ లోకల్ సమస్య ఎందుకు వచ్చిందని..గతంలో మల్కాజిగిరి, కామారెడ్డిలో ఒకరు, హుస్నాబాద్ లో ఒకరు పోటీ చేసినప్పుడు లోకల్ – నాన్ లోకల్ అంశం గుర్తుకు రాలేదా అంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లపై విమర్శలు ఎక్కుపెట్టిన అంజన్ కుమార్ యాదవ్..ఉప ఎన్నికలో రెబల్ గా పోటీకి సిద్దపడ్డారు. నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్..ఎక్కడైనా పోటీ చేయవచ్చు అంటూ గర్జించారు. అయితే శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి సహా పలువురు నేతలు అంజనీకుమార్ యాదవ్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్ కు ఇవ్వాల్సి వచ్చిందో వివరించి ఆయనను బుజ్జగించారు. దీంతో మెత్తపడిన అంజన్ కుమార్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేందుకు అంగీకరించారు. ఈ సమావేశం వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు.

అంజన్ కుమార్ నేతృత్వంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముందుకు : మంత్రి పొన్నం

కాంగ్రెస్ పార్టీ కి సంబంధించి ఎన్నికల్లో అందరినీ సంప్రదించిన తర్వాతనే అభ్యర్థి ఎంపిక ఉంటుందని పొన్నం స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లో అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేయాలని భావించారని..అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం టికెట్ నవీన్ యాదవ్ కు కేటాయించిందని తెలిపారు. ఈ నిర్ణయంతో కినుక వహించిన అంజన్ కుమార్ ఇంటికి ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, వివేక్, నేను వచ్చాం అని….వారి భవిష్యత్ పై మాట్లాడం అని తెలిపారు. అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అని..రెండు సార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ,రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడుగా పని చేశారని గుర్తు చేశారు. కరోనా సమయంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి ఆయన కూడా కరోనా బారిన పడ్డారన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అంజన్ కుమార్ యాదవ్ పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు.. వారి హయాంలో నగరంలో పార్టీ మరింత అభివృద్ధి చెందేలా ముందుకు పోతున్నాం అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకుందని.. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నారు. ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారు అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక అంజన్ కుమార్ సారధ్యంలో జరుగుతుంది.. ఆయన నేతృత్వంలో ముందుకు పోతున్నాం అన్నారు. ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ అంజన్ కుమార్ యాదవ్ తో మాట్లాడారని తెలిపారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించారు అని..అదే రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నీ గెలిపిస్తారని పొన్నం ధీమా వ్యక్తం చేశారు. అంజన్ కుమార్ యాదవ్ ముందుండి ఉప ఎన్నికల్లో ప్రచార కార్కక్రమాలు తీసుకుంటారన్నారు. మా పార్టీ నియంతృత్వం పార్టీ కాదు.. బయటికి స్వేచ్ఛగా చెప్పుకునే పరిస్థితి ఉంటుందని గుర్తు చేశారు. అంజన్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ లో గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారు అన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయడమే మా అందరి లక్ష్యం.. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందరం కలిసి పని చేస్తాం అని పొన్నం స్పష్టం చేశారు.