కవిత నిర్ధోషి అయితే బెయిల్ ఎందుకు రాలేదు: అనురాగ్ ఠాకూర్‌

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్ సహా నిందితులంతా జైలులో ఉన్నారని, ఈ కేసులో కేసీఆర్ చెబుతున్నట్లుగా కవిత నిర్ధోషి అయితే బెయిల్ ఎందుకు రావడం లేదని కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ నిలదీశారు

  • Publish Date - April 24, 2024 / 05:32 PM IST

కాంగ్రెస్‌తో సనాతన ధర్మానికి ప్రమాదం
అసద్ వ్యాఖ్యలపై గాంధీల మౌనం
కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్ సహా నిందితులంతా జైలులో ఉన్నారని, ఈ కేసులో కేసీఆర్ చెబుతున్నట్లుగా కవిత నిర్ధోషి అయితే బెయిల్ ఎందుకు రావడం లేదని కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ నిలదీశారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత నామినేషన్ ర్యాలీకి హాజరైన ఆయన నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం అండతో తెలంగాణలో దోచుకున్నది చాలక కవిత ఢిల్లీకి వెళ్లి లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుందన్నారు. దేశంలో మరోసారి ప్రధాని మోదీ సారధ్యంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీతో సనాతన ధర్మానికి ప్రమాదం నెలకొందన్నారు. సనాతన ధర్మాన్ని రూపుమాపే ప్రయత్నం ఆ పార్టీ చేస్తుందని ఆరోపించారు. అక్బరుద్ధిన్ ఓవైసీ 15నిమిషాల టైమ్‌..అసదుద్ధిన్ ఓవైసీ గోవులను కోసుకుతినండన్న వ్యాఖ్యలపై రాహుల్‌, సోనియాగాంధీలు ఎందుకు మౌనంగా ఉంటారని నిలదీశారు. మైనార్టీలపై రాజకీయ ప్రేమ ప్రదర్శిస్తూ వారిని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ హిందూ మహిళలపై దాడులు జరిగితే మాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. బీజేపీకి ముందు పదేళ్లు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ త్రిఫుల్ తలాక్ ఎందుకు రద్దు చేయలేదని, మహిళ బిల్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ అంబేద్కర్‌కు భారత రత్న కూడా ఇవ్వకుండా అవమానించిందని, సర్దార్ పటేల్ కు ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని నడిపించారని విమర్శించారు. ఎన్నికల సమయంలో రాహుల్ జంధ్యం ధరించి గుడికి వెళ్తారని, మిగతా సమయాల్లో ఎలా ఉంటారో, ఏం తింటారో అందరికీ తెలుసన్నారు. వయనాడ్ లో రాహుల్ ఓడిపోతున్నాడన్నారు..తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం అయ్యిందని విమర్శించారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని మా మహిళ నేత ఓడించిందని హైదరాబాద్ లో ఓవైసీ కూడా మా పార్టీకి చెందిన మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోవడం ఖాయమన్నారు.

దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే పార్టీలతో కాంగ్రెస్ జత కట్టిందని, అనేక అవినీతి కుంభకోణాలు చేసిన కాంగ్రెస్ పాలకుల చేతిలో దేశం భద్రంగా ఉంటుందా? అని ప్రశ్నించారు. కచ్చ దీవులను శ్రీలంకకు అప్పగించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని విమర్శించారు. ప్రతిపక్షాలు సర్జికల్ స్ట్రైక్స్‌ను మెచ్చుకోవడం మాని ప్రశ్నిస్తున్నాయని అసలు ప్రతిపక్షాలు భారత్ పక్షాన ఉన్నాయా ఇతర దేశాల పక్షాన ఉన్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ 40 సీట్లలో గెలవడానికే తిప్పలు పడుతోందని 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కంటే పదేళ్ళలో మోడీ ఎక్కువే అభివృద్ధి చేశారన్నారు.. ఇందిర హయాంలో దూరదర్శన్ బ్లాక్ అండ్ వైట్ ఉండేదని ఇప్పుడు కలర్ లోకి మార్చామన్నారు.

Latest News