TELANGANA | మహానగరంలో మహిళలపై దారుణం

హైదరాబాద్ మహానగరంలో ఒకే రోజు వేర్వేరు ఘటనలో ఇద్దరు మహిళలు లైంగికదాడికి గురవ్వడం కలకలం రేపింది. వనస్థలిపురంలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు అత్యాాచారానికి పాల్పడ్డారు

  • Publish Date - July 30, 2024 / 02:47 PM IST

కదులుతున్న బస్సులో ప్రయాణికులరాలిపై డ్రైవర్ లైంగికదాడి
సాఫ్ట్‌వేర్ యువతిపై స్నేహితుల అత్యాచారం

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో ఒకే రోజు వేర్వేరు ఘటనలో ఇద్దరు మహిళలు లైంగికదాడికి గురవ్వడం కలకలం రేపింది. వనస్థలిపురంలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు అత్యాాచారానికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లగా, మధ్యం మత్తులో తన చిన్ననాటి స్నేహితుడు గౌతంరెడ్డితో పాటు మరో వ్యక్తి లైంగిక దాడి చేశారని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగుచూసింది. సాగర్ రోడ్డు ఓంకార్ నగర్‌లోని బొమ్మరిల్లులో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు గౌతంరెడ్డిని అరెస్టు చేసినట్లుగా, మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లుగా తెలిపారు.

కదులుతున్న బస్సులో ప్రయాణికురాలపై డ్రైవర్ అత్యాచారం
మరో ఘటనలో కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. మహిళ డయల్ 100 నంబర్‌కు కాల్ చేయడంతో విషయం వెలుగు చూసింది. . హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సులో ఓ మహిళ నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తుంది. ఈ బస్సులో కృష్ణ, సిద్దయ్య ఇద్దరు డ్రైవర్లుగా ఉన్నారు. బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్లు బస్సు అద్దాలను క్లోజ్ చేశారు. ఆ తర్వాత సిద్దయ్య బస్సు నడుపుతుండగా కృష్ణ ఆ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. బాధిత మహిళ వెంటనే డయల్ 100 నంబర్ కు కాల్ చేసి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు బస్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సిద్ధయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమచారం. మరో డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా అత్యాచార ఘటనలకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సివుంది. శాసన సభలో శాంతిభద్రతలపై చర్చ జరిగిన మరుసటి రోజునే ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 1లక్ష 2వేల కేసులు నమోదయ్యాయని, ఇందులో 500హత్యలు, 1200దోపిడిలు, 10వేల దొంగతనాలు, 1000కిడ్నాప్‌లు, 1800అత్యాచార ఘటనలు జరిగినట్లుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. అయితే ప్రతిపక్షం ఆరోపించినట్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా లేవని, గత ప్రభుత్వం కంటే మెరుగ్గా అమలవుతున్నాయని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క బదులిచ్చారు.