Site icon vidhaatha

తెలంగాణలో బీఆరెస్‌ ఓటమి!

గరిష్ఠంగా 40 సీట్లతో సరి

కాంగ్రెస్‌ పార్టీకి 72 స్థానాలు?

బీజేపీ రెండు.. ఎంఐఎంకు 5


హైదరాబాద్‌ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌దే విజయమని భారత్‌ పొలిటికల్‌ రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ సెంటర్‌ (బీ-ప్రాక్‌) తెలిపింది. ఫోరెన్సిక్‌ ఎలక్షన్‌ సర్వే పేరిట.. తెలంగాణ ప్రజల మనోగతం తెలుసుకునేందుకు బీ-ప్రాక్‌ ప్రయత్నించింది. కాంగ్రెస్‌కు గరిష్ఠంగా 72 స్థానాలు లభిస్తాయని సర్వే పేర్కొన్నది. అధికార బీఆరెస్‌ గరిష్ఠంగా 40 సీట్ల వద్ద ఆగిపోతుందని వెల్లడించింది. బీజేపీ రెండు స్థానాల్లో గెలుస్తుందని పేర్కొన్నది. ఎంఐఎం ఐదు స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది.


ఓటింగ్‌ శాతం విషయానికొస్తే.. కాంగ్రెస్‌కు 48.43 శాతం ఓట్లు లభిస్తాయని పేర్కొన్నది. బీఆరెస్‌కు దాదాపు పదిశాతం ఓట్లు తగ్గిపోయి.. 36.87 శాతం ఓట్లు లభించే అవకాశం ఉన్నదని తెలిపింది. ఎంఐఎం ఓటు శాతం 2.04శాతం ఉండగా, బీజేపీ ఓటు శాతం 2.98శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. ఖమ్మంలో పదికి పది స్థానాలూ కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లిపోనున్నాయని పేర్కొన్నది. ఆదిలాబాద్‌లో పదికి 9 చోట్ల కాంగ్రెస్‌, ఒక స్థానంలో బీఆరెస్‌ గెలుస్తాయని అంచనా వేసింది.


హైదరాబాద్‌లో 15 సీట్లకు గాను ఎంఐఎం 5 సీట్లలో గెలుపొందుతుందని, కాంగ్రెస్‌ ఐదు సీట్లలో, బీఆరెస్‌ నాలుగు సీట్లలో, ఒక స్థానంలో బీజేపీ గెలుస్తాయని తెలిపింది. కరీంనగర్‌లో 13 స్థానాలకు గాను కాంగ్రెస్‌ 8, బీఆరెస్‌ 4, బీజేపీ 1 స్థానంలో గెలుపొందుతాయని పేర్కొన్నది. మహబూబ్‌నగర్‌లో 14 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 7, బీఆరెస్‌కు 7 లభిస్తాయని తెలిపింది. మెదక్‌లో కాంగ్రెస్‌ 3, బీఆరెస్‌ 7 సీట్లలో గెలిచే అవకాశం ఉన్నదని తెలిపింది.

నల్లగొండలో 12 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 9, బీఆరెస్‌కు 3 వస్తాయని పేర్కొంది. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌కు5, బీఆరెస్‌కు 4, రంగారెడ్డిలో కాంగ్రెస్‌కు 8, బీఆరెస్‌కు 6, వరంగల్‌లో కాంగ్రెస్‌కు 8, బీఆరెస్‌కు 4 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పలువురు మంత్రులు, బీఆరెస్‌ కీలక నేతలు సైతం ఓటమి చవి చూసే అవకాశం ఉన్నదని తెలిపింది.

Exit mobile version