బండి సంజయ్ బంపర్ ఆఫర్

పోలింగ్ ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు భారత ఎన్నికల సంఘం అనేక చర్యలు తీసుకొటోంది. దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పండగలో ప్రతి ఒక్కరు పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది

  • Publish Date - April 22, 2024 / 07:25 PM IST

*80 నుండి 100 శాతం ఓటింగ్ చేయిస్తే రూ.10 వేల ప్రోత్సాహకం

*ఎన్నికల సంఘం చేస్తున్న కృషిలో స్వచ్చంద సంస్థలు, పార్టీలు భాగస్వాములు కావాలన్న సంజయ్

విధాత బ్యూరో, కరీంనగర్: పోలింగ్ ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్యం పెంచేందుకు భారత ఎన్నికల సంఘం అనేక చర్యలు తీసుకొటోంది. దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పండగలో ప్రతి ఒక్కరు పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. దురదృష్టవశాత్తు స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలు మినహాయిస్తే, లోకసభ ఎన్నికలకు ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎన్నికల సంఘంతో పాటు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. అయితే ఇందులో రాజకీయ నేతల భాగస్వామ్యం ఎంత? ఓటర్ల చైతన్యానికి వారు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి? అంటే ప్రశ్నార్థకమే!

ఇలాంటి పరిస్థితుల్లో బంపర్ ఆఫర్ తో కరీంనగర్ ఎంపీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ముందుకు వచ్చారు. 80 నుండి 100% ఓటింగ్ జరిగే ప్రతి పోలీస్ బూత్ కు పదివేల రూపాయల చొప్పున నజరానా ఆయన ప్రకటించారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ నాయకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 80 నుండి 100 శాతం ఓటింగ్ నమోదయ్యేలా కృషి చేసిన వారికి రూ.10 వేల ప్రోత్సాహక నగదు అందజేస్తామన్నారు. సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్టీ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ అనేక ప్రయత్నాలు చేస్తోంది, ఈ ప్రయత్నాల్లో ఎన్నికల సంఘానికి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలన్నారు.స్వచ్ఛంద సంస్థలతోపాటు అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రజాస్వామిక క్రతువులో భాగస్వాములు కావాలన్నారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం అవుతుందన్నారు. అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్ని పోలింగ్ బూతుల్లో 80 నుండి 100 శాతం ఓటింగ్ నమోదు అయినా, ఆయా పోలింగ్ కేంద్రాలకు రూ.10 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందిస్తాం.’’అని తెలిపారు. ఎన్నికల్లో ఎవరైనా సరే తమకు నచ్చినట్లుగా ఏ పార్టీకైనా ఓటేసుకోవచ్చని, అందులో అభ్యంతరం లేదని చెప్పిన బండి సంజయ్ ప్రతి ఒక్కరికీ ఈ విషయంలో అవగాహన పెంపొందించి అధిక శాతం ఓటింగ్ శాతం నమోదయ్యేలా చూడాలని కోరారు.

Latest News