విధాత, హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాగారం గ్రామ సర్పంచ్ గా పోటీచేసి గెలిచిన 95 ఏండ్ల గుంటకండ్ల రామచంద్రా రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు.
తుంగతుర్తి నియోజకవర్గం,నాగారం గ్రామ పంచాయతీ నుంచి 95 సంవత్సరాల వయసులో, పూర్తి ఆరోగ్యంగా ఉన్న గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. హోరాహోరీ పోరులో ప్రత్యర్థి మీద విజయం సాధించారు. ఈ విషయాన్ని రామచంద్రా రెడ్డి కుమారుడు, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కేసీఆర్ కు తెలియచేయగా..ఆయన అశ్చర్యపోయారు.
100 ఏళ్లకు దగ్గరగా ఉన్న ఒక పెద్ద మనిషి నేటి యువతతో పోటీపడుతూ ప్రజాసేవకు ముందుకు రావడం, ఎన్నికల బరిలో నిలవడం, ప్రజల ఆదరణ పొందుతూ గెలవడం, అనేది ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో చాలా అరుదైన విషయం అని కేసీఆర్ ఈ సందర్బంగా రామచంద్రారెడ్డికి అభినందనలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
రామచంద్ర రెడ్డిని అభిమానంతో గెలిపించిన నాగారం గ్రామ ప్రజలను, మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తలను, నాయకులను కేసీఆర్ అభినందించారు.రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని కేసీఆర్ అభిలాషించారు.
ఇవి కూడా చదవండి :
Nara Lokesh : విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్
Census 2027 : జన గణనపై కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం
