కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కాలె యాద‌య్య‌

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మ‌రోషాక్ త‌గిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద‌య్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో యాద‌య్య కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు

  • Publish Date - June 28, 2024 / 03:34 PM IST

న్యూఢిల్లీ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మ‌రోషాక్ త‌గిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాద‌య్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో యాద‌య్య కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా కాలె యాద‌య్య‌ను పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

బీఆర్ఎస్ పార్టీ బీ ఫాంపై గెలుపొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్ట‌ర్ సంజ‌య్, దానం నాగేంద‌ర్, తెల్లం వెంక‌ట్రావ్, క‌డియం శ్రీహ‌రి ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కాలె యాద‌య్య కాంగ్రెస్ పార్టీలో చేర‌డంతో ఆసంఖ్య ఆరుకు చేరింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించగా ఇప్పటివరకు ఆరుగురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి సహా 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే చేరతారన్నారు. ముగ్గురు నలుగురు మినహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హస్తం గూటికి చేరతారని చెప్పారు.

Latest News