- డాక్టర్ కాళీ ప్రసాద్ రావుకు టికెట్
- కొత్త అభ్యర్థి వైపు అధిష్టానం మొగ్గు
- నర్సంపేట, ములుగు స్థానాలు పెండింగ్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిజెపి ఎట్టకేలకు ఒక స్థానాన్ని బీసీలకు కేటాయించింది. పరకాల అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ కాళీ ప్రసాద్ రావు ను ప్రకటించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ తిరిగి టికెట్ ఆశించిన నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ విజయ చందర్ రెడ్డి ని కాదని బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కాళీ ప్రసాద్ కు టికెట్ కేటాయించింది.
ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో మొదటి విడతన తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బిజెపి మూడు స్థానాలను పెండింగ్లో పెట్టింది. రెండో విడత తాజా గా పరకాల స్థానానికి అభ్యర్థిని ప్రకటించినప్పటికీ, నర్సంపేట, ములుగు అభ్యర్థుల ఎంపిక పెండింగ్లో పడింది. నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా భావించిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అనూహ్య పరిణామాల మధ్య బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో నర్సంపేట అభ్యర్థి ఎంపిక పార్టీ అధిష్టానానికి ఇబ్బందిగా మారింది.
అభ్యర్థిత్వం కోసం ఒకరిద్దరు ఆశిస్తున్నప్పటికీ అధిష్టానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది. ములుగు ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి కూడా ఇద్దరు నాయకులు టికెట్ ఆశిస్తున్నారు ములుగు అసెంబ్లీ టికెట్ ఆశిస్తూ బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు డాక్టర్ ప్రహ్లాద్ బిజెపిలో చేరినప్పటికీ ఆయన అభ్యర్థిత్వం ఖరారు చేయడానికి అధిష్టానం జాప్యం చేస్తుంది.
ఇక్కడి నుంచి తాటి కృష్ణ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా 12 నియోజకవర్గాలలో రెండు ఎస్సీ, 3 ఎస్టి రిజర్వుడు స్థానాలుగా ఉన్నాయి. ఏడు స్థానాలు జనరల్ గా ఉన్నాయి. ప్రకటించిన 10 స్థానాలకు గాను ఒకటి బీసీ, రెండు ఎస్సి, రెండు ఎస్టిలకూ ఐదు స్థానాలు అగ్ర కులాలకు కేటాయించారు. మూడు స్థానాలు మహిళలకు కేటాయించారు.