Site icon vidhaatha

బీసీలను అవమానిస్తున్న బీఆరెస్‌, కాంగ్రెస్‌లు: లక్ష్మణ్‌

విధాత : తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ సీఎంను చేస్తామన్న బీజేపీ ప్రకటనను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, మంత్రి కేటీఆర్‌లు అవహేళన చేస్త్తు మాట్లాడటం బీసీలను అవమానించడమేనని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ. బీసీలు బీజేపీకి దగ్గరవుతారన్న అక్కసుతో రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారని విమర్శించారు. బీసీలు తమకున్న ఓటు ఆయుధంతో రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. బీసీ వ్యక్తి ప్రధాని అయితే రాహుల్ గాంధీ జీర్ణించుకోలేక పోతున్నారని వ్యాఖ్యలు చేశారు.


కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ప్రకటించే తాయిలాల కోసం తాము ఆరాటపడడం లేదని బీసీలు నిరూపించుకోవాలన్నారు. బీసీలు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతైన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలన్నారు. 1358 ఓబీసీ శాసన సభ్యులు బీజేపీ తరపున గెలిచారని, 160 మందికి శాసనమండలి సభ్యులుగా అవకాశం ఇచ్చామన్నారు. తెలంగాణలో ఈనెల 7న సాయంత్రం బీసీల ఆత్మగౌరవ సభ పేరుతో హైదరాబాద్ సభ నిర్వహించనున్నామని, ఈ సభకు ప్రధాని మోదీ హాజరవుతారని ఎంపీ తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం ఎవరికి మద్దతు ఇస్తుందో ప్రకటించలేదన్నారు.


కుటుంబ, వారసత్వ పార్టీయైన బీఆరెస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులు మినహా మిగతా వారికి సీఎం పదవి ఇవ్వరని, అలాంటి వారు కూడా బీసీ సీఎం ప్రకటనను అవమానించడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. జనసేన ఎన్డీఏ భాగస్వామిగా ఉందని, పొత్తు ధర్మాన్ని పాటించి జనసేనతో సీట్ల సర్దుబాటు చేసుకుంటామన్నారు. జనసేనతో పొత్తు బీజేపీకి లాభిస్తుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి వైదొలగడం కారణంగా బీజేపీ అన్ని సీట్లు సాధించగలిగిందని తెలిపారు. జనసేనతో పొత్తు నేపథ్యంలో టికెట్ ఆశించిన బీజేపీ అభ్యర్థులు నిరాశ పడవద్దని సూచించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, పదవులు, అవకాశాలు చాలా వస్తాయన్నారు. తెలుగుదేశం పార్టీతో బీజేపీకి పొత్తు లేదని స్పష్టం చేశారు.

Exit mobile version