Cherka Mahesh : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు బీజేపీకి షాక్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. నియోజకవర్గ మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేష్ పార్టీకి రాజీనామా చేసి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సుజాత గోపీనాథ్‌కు మద్దతు ప్రకటించారు. రేవంత్ రెడ్డి-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలపై సంచలన ఆరోపణలు చేశారు.

Cherka Mahesh

విధాత : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ నియోజకవర్గంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీజేపీ మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు తన రాజీనామా లేఖ పంపించారు. నా మనస్సాక్షి మేరకే రాజీనామా చేస్తున్నానని..ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సుజాత గోపీనాథ్ కు మద్దతు ప్రకటిస్తున్నానని వెల్లడించాడు. ఈ సందర్భంగా చెర్క మహేష్ కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలపై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి-బీజేపీ గుట్టుచప్పుడు కాకుండా చేతులు కలిపి తెలంగాణను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ తెలంగాణ ప్రజల కోసం ఏమీ చేయలేదని…. నేను అలాంటి పార్టీలో ఇంకా కొనసాగలేను అన్నారు. రైతులు, యువత, మహిళలు, బీసీలు బాధలో ఉన్నా బీజేపీ మౌనంగా ఉందని విమర్శించారు. బీజేపీ-కాంగ్రెస్ కలిసి బీసీ రిజర్వేషన్లు అడ్డుపడటం పెద్ద మోసం అన్నారు. సామాజిక న్యాయానికి తూటా వేసిన బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకు రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణకు సొంత గొంతుక కావాలని..అందుకే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సుజాత గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలబడటం నైతికంగా సరైందని భావిస్తున్నానన్నారు.