ఉత్తమ్‌పై మళ్లీ యూ ట్యాక్స్‌ ఆరోపణలు.. కేసులకు భయపడేదు: ఏలేటి

పౌరసరఫరాలు, ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిల్లర్లు, కాంట్రాక్టర్ల నుంచి యూ ట్యాక్స్‌ వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి మరోసారి ఆరోపించారు

  • Publish Date - May 23, 2024 / 06:30 PM IST

విధాత : పౌరసరఫరాలు, ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మిల్లర్లు, కాంట్రాక్టర్ల నుంచి యూ ట్యాక్స్‌ వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి మరోసారి ఆరోపించారు. గురువారం నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు, సన్నబియ్యం సేకరణపైన అవకతవకలపై ప్రశ్నిస్తే తమపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేసులకు భయపడేది లేదని, పౌరసరఫరాల శాఖ కుంభకోణంపై పోరాడుతామని స్పష్టం చేశారు. కావాల్సిన వారికి టెండర్లు దక్కేలా నిబంధనల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టానుసారం మార్పులు చేశారని ఆరోపించారు.

నూక ఉన్న సన్న బియ్యం రూ.56 కొంటూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాఖ నిర్వహణలో దారుణంగా విఫలమయ్యారని మరోసారి విమర్శించారు. అసలు ఉత్తమ్‌కు రైతాంగ సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు పడిపోతుందో తెలియని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నదుపుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కాదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీజేపీతో టచ్‌తో ఉన్నారని చెప్పారు.