విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లా.. సీఎం కెసిఆర్ స్వంత జిల్లాపై బీజేపి ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజక వర్గాల్లో గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నియోజక వర్గంలో పాలక్ (ప్రబారి)తో పాటు నియోజక వర్గ ఇన్‌చార్జి, అసెంబ్లీ కన్వీనర్, విస్తారాక్‌లను నియమించి పార్టీ బలో పేతానికి బీజేపి అధిష్టాన వర్గం చర్యలు చేపట్టింది. పాలక్, అసెంబ్లీ ఇన్‌చార్జి, అసెంబ్లీ కన్వీనర్, విస్థారాక్‌లు కలిసి నాయకులను, కార్యకర్తలను ఎన్నికల సంగ్రామంలో పోరాడేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు.
ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను సీనియర్ రాజకీయ నాయకులను నియోజక వర్గంలో పాలక్‌లుగా నియమించారు. వీరు ప్రతి నెలలో 3 సార్లు నియోజక వర్గంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. టికెట్లు ఆశిస్తున్న నేతలను అందరినీ సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ దశ దిశ నిర్దేశిస్తారు. ఇతర పార్టీలలో ముఖ్యులను, పార్టీలోకి వచ్చేందుకు ప్రధానంగా పాలక్‌లు వారితో మాట్లాడి పార్టీలో జాయిన్ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు.
తటస్తులు, అన్నిరంగాలలోని మేధావులను కలుస్తారు. బీజేపి పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఇదంతా ఒక్క ఎత్తు ఐతే పార్టీలో ముఖ్య నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా నర్సాపూర్ నియోజక వర్గం వెల్దుర్తి, మాసాయిపేట ఉమ్మడి మండలంలో ఈటెల కు ఉన్న వ్యవసాయ భూముల విషయంలో సీఎం సర్వే చేయించి రైతులకు కొంత భూమిని పంచిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ప్రత్యేకంగా మెదక్, నర్సాపూర్ గజ్వేల్ నియోజకవర్గాల్లో ఈటల స్పెషల్ ఫోకస్ పెట్టారు.
సీఎం కెసిఆర్ పై ఈటెల రాజేందరే పోటీ చేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా మెదక్, నర్సాపూర్, గజ్వేల్, సంగారెడ్డి నియోజక వర్గాల్లో పాలక్ లను ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకులను పార్టీ అధిష్టాన వర్గం నియమించింది. మెదక్ కు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌ని నియమించగా, గజ్వేల్‌కు మాజీ ఎమ్మెల్యే గుజ్జు ల రామకృష్ణారెడ్డి, నర్సాపూర్ కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, అసెంబ్లీ ఇన్‌చార్జిగా పార్టీ సీనియర్ నేత పెద్దోళ్ల గంగారెడ్డిని పార్టీ నియమించింది.
ఇలా ఉమ్మడి జిల్లాలోని 10 నియోజక వర్గాల్లో పక్కా ప్లాన్ ప్రకారం బీజేపీ కమిటీలను ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 10 నుండి 21 మంది సభ్యులతో శక్తి కేంద్రాలను నియమించి. అందులో ఒకరిని ఇన్‌చార్జిగా నియమించారు. పాలక్ నెలలో 3 సార్లు పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పార్టీని గ్రామస్థాయిలో పటిష్ఠం చేస్తూ బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పాలక్‌లు వారికి నియమించిన నియోజకవర్గాల్లో పని ప్రారంభించారు.
మెదక్ నియోజక వర్గానికి ఎంపీ అరవింద్ ఇప్పటికే 3 సార్లు వచ్చి సమావేశాలు నిర్వహించారు.కేంద్రం మత్స్య శాఖ, పాడి పరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. పటాన్ చెరువు, నారాయణఖేడ్ సిద్దిపేట, ఆందోల్, నియోజకవర్గలలో పార్టీ బలోపేతానికి అధిష్టాన వర్గం చర్యలు తీసుకుంటుంది. నారాయణఖేడ్, జహిరాబాద్, ఆందోల్‌లో పార్టీ కార్యక్రమాలు కొంత మందకొడిగా సాగుతున్నాయి.
ఏది ఏమైనా ఉమ్మడి జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు బిజెపి పార్టీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే గ్రామస్థాయి నుండి నియోజకవర్గస్థాయి, జిల్లా స్థాయి, కమిటీలను బలోపేతం చేస్తుంది. అందులో భాగంగానే పటాన్ చెరువు నియోజక వర్గానికి సీనియర్ నేత జాతీయ కార్యదర్శి మురళీధర్ రావును నియమించారు. దుబ్బాక నియోజక వర్గానికి అంజిరెడ్డి, సిద్దిపేటకు మురళీదర్ దేశ్ పాండే, సంగారెడ్డికి కొంపల్లి మోహన్ రెడ్డి, నారయణ్‌ఖేడ్ కు ప్రకాష్ రెడ్డి, జహీరాబాద్ కు సుగుణాకర్ రావులను పార్టీ నియమించింది.