కలెక్టర్‌ను అడ్డుకున్న ఘటనపై జడ్పీ సీఈవో ఫిర్యాదు … పాడి కౌశిక్‌రెడ్డిపై బీఎన్‌ఎస్ సెక్షన్ కేసు

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ ఒకటో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం నిర్వహించిన కరీంనగర్‌ జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు

  • Publish Date - July 3, 2024 / 02:20 PM IST

విధాత, హైదరాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ ఒకటో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళవారం నిర్వహించిన కరీంనగర్‌ జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126(2) కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. బీఎన్‌ఎస్ చట్టాల కింద కేసు నమోదైన తొలి ఎమ్మెల్యేగా కౌశిక్‌రెడ్డి రికార్డులకెక్కారు. ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో మండల విద్యాధికారులతో ఎమ్మెల్యే హోదాలో కౌశిక్‌రెడ్డి విద్యాశాఖ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. అందులో పాల్గొన్న ఎంఈవోలకు డీఈవో జనార్ధన్‌రావు మెమోలు జారీ చేశారని, డీఈవోను సస్పెండ్ చేయాలంటూ కౌశిక్‌రెడ్డి జడ్పీ సమావేశంలో బీఆరెస్‌ జడ్పీటీసీలతో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. సభలో ఆందోళన పెరుగుతుండడంతో కలెక్టర్ పమేలా సత్పతి తన కుర్చీలో నుంచి లేచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే ఆమె ఎదుట నేలపై బైరాయించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కౌశిక్‌రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టర్ వెళ్లిన తర్వాత సభలో ఎమ్మెల్యే, బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జడ్పీటీసీ సభ్యుల మధ్య పరస్పర విమర్శలు చోటుచేసుకున్నాయి. కలెక్టర్ విధులకు ఆటంకం కల్గించారని, సభ్యులను దూషించారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై జడ్పీ సీఈవో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.

తీవ్రంగా ఖండించిన కేటీఆర్‌
బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారని, ప్రభుత్వ పెద్దల అవినీతి బాగోతం, అక్రమాలను బయటికి తెస్తున్నారని తెలిపారు. అందుకే కేసుల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసున్నారని విమర్శించారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కేసు నమోదు చేశారని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆరెస్‌ నేతలు భయపడేది లేదన్నారు. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం విద్యారంగ సమస్యలపై అధికారులతో సమీక్ష చేయడం తప్పా అని ప్రశ్నించారు. జడ్పీ సమావేశంలో తను లేవనెత్తిన సమస్యపై కలెక్టర్ స్పందించట్లేదని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నిరసన తెలిపే యత్నం చేశారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధికి నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల నోరు మూయించాలనే కుట్రతో అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కేసు పెట్టారని ఆరోపించారు. ఇది దుర్మార్గపూరిత చర్య అని, ఆ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు.

Latest News