కరీంనగర్ జిల్లా పరిషత్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రచ్చ … డీఈఓ ను సస్పెండ్ చేయాలంటూ నిరసన

ఒక శాసనసభ్యునిగా హుజురాబాద్ నియోజకవర్గంలో పాఠశాలల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశానికి ఎంఈవోలు ఎలా వెలుతారంటూ నోటీస్‌లు జారీ చేసి వారిని బాధ్యతల నుంచి తొలగించిన డీఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కరీంనగర్ జిల్లా పరిషత్‌లో వీరంగం వేశారు.

  • Publish Date - July 2, 2024 / 06:45 PM IST

విధాత : ఒక శాసనసభ్యునిగా హుజురాబాద్ నియోజకవర్గంలో పాఠశాలల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఈ సమావేశానికి ఎంఈవోలు ఎలా వెలుతారంటూ నోటీస్‌లు జారీ చేసి వారిని బాధ్యతల నుంచి తొలగించిన డీఈవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కరీంనగర్ జిల్లా పరిషత్‌లో వీరంగం వేశారు. ఎంఈవోలకు ఈ రకంగా నోటీస్‌లకు ఇచ్చే హక్కు డీఈవోలకు లేదని, దీనిపై కోర్టుకు వెలుతానని, ఇది హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కౌశిక్‌రెడ్డి వాదించారు. జిల్లాలో పాఠశాలల పనితీరుపై విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష సమావేశాన్ని మంత్రి నిర్వహించాల్సింది పోయి సిగ్గు లేకుండా.. నా నియోజకవర్గంలో నేను సమీక్ష సమావేశం పెట్టుకుంటే ఎంఈఓ లకు నోటీసులు ఇస్తారా? ఈ విషయమై డీఈవోను వెంటనే సస్పెండ్ చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఇందుకు సంబంధించి సమావేశంలో తీర్మానం కూడా ఆమోదించాలని, జిల్లా కలెక్టర్ దీనిపై తనకు స్పష్టమైన సమాధానం చెప్పాలని సమావేశంలో నేలపై బైఠాయించారు. కలెక్టర్ పమేలా సత్పతి సర్ధిచెప్పిన కౌశిక్‌రెడ్డి నిరసన వీడలేదు. కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి సభ్యుడు గీకురు రవీందర్ కౌశిక్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోబోయారు. దీనికి స్పందించిన కౌశిక్ రెడ్డి.. గీకురు రవీందర్ కు మాట్లాడే హక్కు లేదని.. ఆయన బీఆరెస్ పార్టీ బీఫారంపై గెలిచి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డికి మద్దతుగా జడ్పీ సమావేశంలో మూకుమ్మడిగా బీఆరెస్‌ పార్టీ సభ్యులు లేచి నిలుచుని ప్లకార్డులు ప్రదర్శించారు. డీఈవోను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు.

Latest News