Ande Sri | హైదరాబాద్ : ప్రముఖ కవి, ‘జయ జయ హే తెలంగాణ…’ ఉద్యమ గీత రచయిత డా. అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అందెశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.
అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు : కేటీఆర్
ప్రముఖ కవి, రచయిత, డా. అందెశ్రీ అకాల మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం పట్ల విచారం తెలుపుతూ, కేటీఆర్ తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటని ఆయన అన్నారు. అందెశ్రీ మరణంతో శోకసముద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు.
