Site icon vidhaatha

Pharmacity Lands  | ఫార్మాసిటీ భూములను దోస్తున్నకాంగ్రెస్ నేతలు : కేటీఆర్‌ ఆరోపణలు

Pharmacity Lands  | హైదరాబాద్ ఫార్మాసిటీ భూములను కాంగ్రెస్ పార్టీ నేతల దోపిడి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవగానే ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి, భూములను రైతన్నలకు తిరిగి ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమ కాంగ్రెస్ లీడర్లతో కలిసి ఫార్మాసిటీ భూములను కొట్టేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ భూములపై కాంగ్రెస్ నేతలు గద్దల మాదిరి వాలి దోచుకుంటున్నారని..ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతన్నలకు నష్టపరిహారంగా కేటాయించిన ఇండ్ల స్థలాలను కాంగ్రెస్ నేతలు తమ పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రైతులకు దక్కాల్సిన ఇండ్ల స్థలాలను అతి తక్కువ రేట్లకు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారన్నారు.

రైతులకు నష్టపరిహారంగా దక్కాల్సిన దానిని కాంగ్రెస్ నేతలు ఎందుకు దోచుకుంటున్నారు?.. రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతులనూ వదలకుండా, దోపిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరు సిగ్గుచేటు అని కేటీఆర్ మండిపడ్డారు. కాగా ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతుల కోసం మీర్ ఖాన్ పేటలోని లే అవుట్ లో 5,720మంది రైతులకు పట్టాలిచ్చిన కేసీఆర్ ప్రభుత్వం వారికి పొజిషన్ల ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పొజిషన్లు ఇచ్చే విషయమై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. ఇదే సమయంలో ప్రభుత్వం 330ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అదే లే అవుట్ నుంచి వెళ్లేలా అలైన్ మెంట్ ఖరారు చేసింది. దీంతో ఎవరి ప్లాట్లు పోతాయోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు రైతుల వద్ధ నుంచి తక్కువ ధరకే ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారని..అమాయక రైతులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.

Exit mobile version