Harish Rao | విద్యుత్తు వైఫల్యాలను కప్పిపుచ్చుతున్న సీఎం రేవంత్: హరీశ్‌రావు

విద్యుత్తు రంగ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలపై ఉద్యోగులపై సీఎం రేవంత్‌రెడ్డి నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఫైర్ అయ్యారు.

  • Publish Date - May 15, 2024 / 04:00 PM IST

మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌
ఆడలేక పాత గజ్జెలన్నట్లుగా ఉందని సైటర్లు

విధాత: విద్యుత్తు రంగ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలపై ఉద్యోగులపై సీఎం రేవంత్‌రెడ్డి నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ట్విటర్ వేదికగా ఆయన సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. విద్యుత్తు రంగ వైఫల్యాలకు నేనే బాధ్యుడన్నట్టుగా రేవంత్‌రెడ్డి నాపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని, ఆయన వైఖరి ఆడలేక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తున్నదని ఎద్దేవా చేశారు. బీఆరెస్ ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్తు సరఫరా చేసేందుకు.. విద్యుత్తు ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించిందన్నారు. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిందన్నారు.

కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విద్యుత్తు వ్యవస్థను కుప్ప కూల్చిందని, గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్తు సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణ చేస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్తు ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు.

విద్యుత్తు ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ హయాంలో రెప్ప పాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్ ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిదని హితవు పలికారు. తన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతారని సీఎం భ్రమల్లో ఉన్నట్టున్నారని, వాటిని వీడి పాలన పై దృష్టి పెడితే మంచిదన్నారు.

Latest News