Harish Rao | కాంగ్రెస్ కు ఓటేయడమంటే మోసాన్ని బలపరచడమే: హరీశ్‌రావు

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయడమంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని బలపరచడమే అవుతుందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు

  • Publish Date - May 20, 2024 / 03:45 PM IST

ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాల ప్రచారం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో హరీశ్‌రావు

విధాత : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయడమంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని బలపరచడమే అవుతుందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం దేవరకొండలో పట్టభద్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వంద రోజులైపోయినా అమలు కాలేదన్నారు. విద్యార్థి భరోసా కార్డు రాలేదని, స్కూటీలు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఎన్నికల ముందు ప్రియాంక, రాహుల్, రేవంత్ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదన్నారు.

ఉద్యోగులకు మూడు డీఏలు అన్నారని, ఒక్క డీఏ కూడా రిలీజ్ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్నాడని..ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలా ఇచ్చారో చెప్పాలని ఎద్దేవా చేశారు. వంట అంతా వండిపెట్టాక..వద్దించినట్లుంది కాంగ్రెస్ వ్యవహారమని విమర్శించారు. ఆరునెలలైన కాంగ్రెస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. బీజేపీ ఏటా రెండు కొట్లా ఉద్యోగాలిస్తామన్న హామీ అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రిటర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ ఇవ్వలేదని, బడిపంతుళ్ళపై లాఠీలు, బడుగు జీవులకు జూటా హామీలు.. ఇదీ రేవంత్ పాలన తీరు అని దుయ్యబట్టారు.

అందుకే విద్యావంతులు, నిరుద్యోగులు ఆలోచించి బీఆరెస్ అభ్యర్థి ప్రశ్నించే గొంతకు రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. బీఆరెస్ గెలిస్తేనే కాంగ్రెస్ సక్రమంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన పీఆర్‌సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. జర్నలిస్టులకు వంద కోట్లు ఇస్తామని …వంద పైసలు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతుండగా చేతలు గడప దాటడం లేదన్నారు.

వడ్లకు రైస్ మిల్లులో..నాలుగు కేజీల తరుగు పెడుతున్నారని,ముప్పై రోజులైనా వడ్లు కొనడం లేదని, తడిసిన ధాన్యం పట్టించుకునే నాథుడు లేడని, 500 బోనస్ విషయంలో సీఎం చేతులెత్తారని విమర్శించారు. మంత్రులు, ఉన్నతాదికారులు రైతుల సమస్యలపై క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయడం లేదన్నారు. రైతుల ముఖాల్లో ఆనాడు చిరునవ్వు..నేడు కన్నీరు అన్నట్లుగా ఉందన్నారు. హామీలపై కాంగ్రెస్ నేతలు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయ్యిందని…బాండ్ పేపర్ బౌన్స్ కావడంతో ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ కు శిక్ష తప్పదన్నారు.

Latest News