ఇదిగో నా రాజీనామా.. నీవు రాజీనామా ఇవ్వు: హరీశ్‌రావు

ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ అమలు చేస్తానని, నీవు రాజీనామాకు సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌కు స్పందించిన మాజీ మంత్రి టి.హరీశ్‌రావు తాను చెప్పినట్లుగా శుక్రవారం తన రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు

  • Publish Date - April 26, 2024 / 12:12 PM IST

సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌
గన్‌ పార్కు వద్ధ రాజీనామాతో హల్‌చల్‌

విధాత : ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ అమలు చేస్తానని, నీవు రాజీనామాకు సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌కు స్పందించిన మాజీ మంత్రి టి.హరీశ్‌రావు తాను చెప్పినట్లుగా శుక్రవారం తన రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖను తీసుకుని అక్కడికి వచ్చారు. అయితే హరీశ్‌రావు సవాల్‌ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అక్కడికి రాలేదు. రాజీనామాతో వచ్చిన హరీశ్‌రావును, ఆయన వెంట ఉన్న మాజీ మంత్రులను, బీఆరెస్‌ నాయకులను పోలీసులు ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అనుమతి నిరాకరించారు. దీంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తన వెంట నలుగురు మాత్రమే వచ్చారని, తాను కోడ్‌ ఉల్లంఘించలేదని హారీశ్‌రావు చేసిన వాదనతో పోలీసులు ఆయనను ముందుకెళ్లేందుకు అనుమతించారు. హరీశ్‌రావు గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించి మాట్లాడారు.

సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ చేసినట్లుగా తాను ఇక్కడికి రాజీనామాతో వచ్చానన్నారు. ఆగస్టు 15లోగా ఆరు గ్యారంటీలలో 13హామీలు, రైతు రుణమాఫీ అమలు చేయాలన్న నా సవాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్వీకరించి రాజీనామా లేఖతో వస్తే ఇద్దరి రాజీనామాలను మేధావులకు అప్పగిద్దామన్నారు. ఆగస్టు 15లోగా హామీలు అమలు చేస్తే వారు నా రాజీనామాను స్పీకర్‌కు అందిస్తారని, చేయకపోతే నీ రాజీనామాను గవర్నర్‌కు ఇస్తారని హరీశ్‌రావు తెలిపారు. సీఎంకు రావడానికి మొహమాటంగా ఉంటే తన పిఏతో అయినా స్టాఫ్ తో అయినా రాజీనామా లేఖను పంపించాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుల సాక్షిగా మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నానని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసిందని, డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. సోనియమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారని, సోనియా గాంధీ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

Latest News