హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
ఐదు నెలల్లోనే విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్తం
మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి
విధాత: జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఏ హోదాలో రాష్ట్రానికి పిలుస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం సూర్యాపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో సగం పాలన ఢిల్లీ నుంచి చేయాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఏ పని చేయాలన్న ఢిల్లీలో అనుమతి తీసుకుని చేయాలని, రాష్ట్ర హక్కులు, నదీ జలాలను హరిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం మళ్లీ పరాయి పాలనలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ఎంతో బాగా పాలన చేశామని, 2014 జూన్ రెండు నుంచి 2023 డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ వాళ్లు పరిపాలించుకున్నారని, మళ్లీ దురదృష్టవశాత్తు పరాయి పాలన వచ్చి ఢిల్లీపై ఆధార పడాల్సిన దురదృష్టం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కరెంట్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సెల్‌ఫోన్ లైట్లతో హాస్పిటల్స్‌లో ఆపరేషన్లు చేస్తున్న విషయాలు పత్రికల్లో వచ్చాయంటే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
డూప్లికేట్ మందులు మార్కెట్లోకి వస్తున్న ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని దాటవేస్తున్నారు… రైతు పండించిన పంటకు బోనస్ కూడా ఇవ్వడం లేదని, కనీసం పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయలేని అసమర్ధ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో 1000 గురుకులాలను ఏర్పాటు చేసి ఆదర్శవంతంగా నిర్వహించిన కేసీఆర్ 10 లక్షల రూపాయలు తీసుకొనే కళాశాలలో కూడా అమలు చేయని అహారాన్ని విద్యార్థులకు అందించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నాసిరకం ఆహారం అందిస్తుండగగా, వందలాదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురై తిన్న పట్టించుకోవడం లేదన్నారు. ఆసుపత్రుల్లో సెల్ ఫోన్ లైట్ వేసుకొని ఆపరేషన్లు చేసే దుస్థితికి తీసుకువచ్చారు.
దాడులు చేసి అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ వైపే చూస్తున్నారని తెలిపారు. బీఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మంచి వాక్చాతుర్యం ప్రశ్నించే తత్వం పోరాట పటిమ ఉన్న వ్యక్తి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఆయన అనుచరులే తిట్టిపోసుకుంటున్నారని ఆయనపై 56 కేసులు నమోదు అయితే బీఆరెస్ ప్రభుత్వం పెట్టింది ఒకటి లేదన్నారు. బీజేపీ అభ్యర్థి పోలింగ్ రోజు కనపడి తర్వాత కనిపించకుండా పోతాడని, ఆయన మాట్లాడినట్టు నేనెప్పుడూ చూడలేదని, ఇక ఆయన పట్ట భద్రుల పక్షాన ఎలా ప్రశ్నిస్తాడన్నారు. ఓటు వేస్తున్నామంటే మన గొంతును అభ్యర్థికి ఇస్తున్నట్లేనని, ప్రశ్నించే గొంతుక ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.