లీగల్‌గా రమ్మంటే దౌర్జన్యం చేస్తున్నారు: ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి
విధాత: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్రలో తన భూ వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వాస్తవాలు వివరిస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన తన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సోమవారం సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని మల్లారెడ్డి చెప్పారు. సీఎంను, రెవెన్యూ మంత్రిని, కలెక్టర్‌ను కూడా కలిసి నా వద్ద ఉన్న ఓరిజనల్ డాక్యుమెంట్స్ చూపిస్తానన్నారు.
పోలీసులు మా వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యానికి దిగిన ఆక్రమణదారులను వదిలి మాపై కేసు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. అన్ని విషయాలను సీఎం రేవంత్ ను కలిసి వివరిస్తామనన్నారు. 40 ఏళ్లగా ఆ భూమికి కంపౌండ్ వాల్ ఉందని, ఆ స్థలం తాము కొనుగోలు చేసి 14 ఏళ్లు అవుతుందని మల్లారెడ్డి స్పష్టం ఆయన చేశారు. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.
వాగ్వాదానికి వచ్చిన వారు ల్యాండ్ గ్యాబర్స్ ముఠా అని ఆరోపించారు. ఆ ముఠా రూ.5 కోట్లకు డీల్ కుదుర్చుకోని.. పది మందికి పైగా ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి వంద మంది వచ్చి దౌర్జన్యంగా స్థలంలో ఫెన్సింగ్ వేసి, గోడ కట్టారన్నారు. వారికి పోలీసులు సపోర్ట్ చేశారని తెలిపారు. అలాగే భూ వివాదంపై సర్వే కొనసాగుతుందని, త్వరలోనే ఇది ఎవరి భూమి అనేది తేలిపోతుందని మల్లారెడ్డి పేర్కోన్నారు.
ఈ వివాదంపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాము 13 ఏళ్ల క్రితం ఆ భూమిని కొనుగోలు చేశామని, అప్పటి నుంచి దానికి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నామని వెల్లడించారు. 2011లో మల్లారెడ్డి, నేను అసలు రాజకీయాల్లోకి రాలేదని, కొందరు కావాలనే మాపై వివాదాలు సృష్టిస్తున్నారని, లీగల్ గా రమ్మంటే మాపైనే దౌర్జన్యం చేస్తున్నారన్నారని మండిపడ్డారు.
మల్లారెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్ ప్రభుత్వం..రాజీనామాకు లక్ష్మణ్‌కు సవాల్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాకా మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిను రాజకీయంగా టార్గెట్ చేసినట్లుగా కనబడుతుంది.ఇప్పటికే వారి విద్యాసంస్థల్లోని కొన్ని భవనాలను సైతం అక్రమ నిర్మాణం పేరుతో కూల్చివేసి, సీజ్ చేశారు. తాజాగా పేట్ బషీరాబాద్ లోని రెండున్నర ఎకరాల స్థలం విషయంలో చెలరేగిన వివాదం వెనుక కూడా రాజకీయ ప్రొద్భలం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఆ స్థలం మాదంటూ పలువురు నిన్న మల్లారెడ్డి, ఆయన అల్లుడితో వాగ్వాదానికి దిగారు.
దీంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వారితో గొడవ పడ్డారు. ఈ వివాదన్ని సివిల్‌గా తేల్చాల్సిన పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాలన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మల్లారెడ్డిని టార్గెట్ చేసిందన్న ప్రచారానికి ఊతమిస్తుంది. ఈ నేపథ్యంలో తన భూవివాదంపై వాస్తవాలను వివరించేందుకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తానన్న మల్లారెడ్డికి సీఎం అపాయింట్ మెంట్ ఇస్తారా ఇవ్వరా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ వివాదంలో మల్లారెడ్డికి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ విప్ అడ్లూరి లక్ష్మణ్ తాను ఈ భూమిపై మాకు 2016నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉందని, మల్లారెడ్డి ఎందుకు ఇన్ని రోజులు వెకెట్ చేయించలేదని ప్రశ్నించారు. మల్లారెడ్డి వద్ద సరైన పత్రాలుంటే సర్వేను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్‌కు మల్లారెడ్డి సవాల్ విసిరారు. సుచిత్రలోని తన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. నా భూమి పత్రాలు సరైనవైతే రాజీనామా చేసేందుకు నువ్వు సిద్ధమా అని లక్ష్మణ్‌కు సవాల్ విసిరారు.
కాగా.. నాది తప్పు అని నిరూపిస్తే అన్నీ వదిలేసి వెళ్లిపోతానని అన్నారు. వాళ్లవే అన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని మల్లారెడ్డి ఆరోపించారు. ఈ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి, రెవిన్యూ మంత్రి, సంబంధిత కలెక్టర్లను కలుస్తానని.. తన దగ్గరున్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఒంటి గంట వరకు సుచిత్ర భూములపై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నెంబర్ 82, 83ను సర్వే చేసి విస్తీర్ణాన్ని గుర్తించారు. రెవెన్యూ అధికారులు ఏం రిపోర్టు ఇస్తారనేది కీలకంగా మారింది. వారు తమ రిపోర్టును పోలీసులకు అందించనున్నారు.