మర్యాదపూర్వకమేనని వ్యాఖ్యలు
విధాత : బీఆరెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి (దుబ్బాక), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు), మాణిక్‌రావు (జహీరాబాద్) ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటీ మెజార్టీతో ఉన్న సమయంలో ఈ నలుగురు ప్రతిపక్ష ఎమ్మ్యెల్యేలు ముఖ్యమంత్రిని కలువడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది. వీరిలో సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. తాము మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిశామని నలుగురు ఎమ్మెల్యేలూ చెబుతున్నారు. తమ నియోజకవర్గాల్లో పరిష్కరించాల్సిన సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు పేర్కొంటున్నా.. లోక్‌సభ సన్నాహక సమావేశాలు ముగించుకుని, అసెంబ్లీ ఎన్నికల సమీక్షా సమావేశాలను బీఆరెస్ ప్రారంభించనున్న నేపథ్యంలో నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలువడం అనేక రకాల ఊహాగానాలు అవకాశం ఇచ్చింది.