రేపు కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పార్లమెంటరీ పార్టీ భేటీ

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు జరుగనుంది.

  • Publish Date - January 25, 2024 / 09:55 AM IST

విధాత : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు జరుగనుంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో జరుగనున్న ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు హాజరుకానున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై రేపటి సమావేశంలో ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు. ముఖ్యంగా కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి చేర్చి కేంద్రం పర్యవేక్షణలోకి తీసుకోవాలన్న ప్రతిపాదనలపై బీఆరెస్ పార్లమెంటులో ప్రశ్నించే విషయమై కేసీఆర్ పార్టీ ఎంపీలకు మార్గదర్శకం చేయవచ్చని భావిస్తున్నారు. అలాగే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుపై కూడా ఈ భేటీలో చర్చించి మరికొందరి పేర్లను అధికారికంగా ఖరారు చేయవచ్చని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్‌రావులకు టికెట్ల విషయమై హామీ ఇచ్చారు. నల్లగొండ, భువనగిరి ఎంపీ టికెట్లలో ఒకదానిని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన కుమారుడు అమిత్‌రెడ్డికి ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వర్గం మోకాలడ్డుతున్నారు. మెదక్ ఎంపీ టికెట్‌ను మాజీ కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డికి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తుండగా, స్థానిక మాజీ మంత్రి హరీశ్‌రావు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపధ్యంలో బీఆరెస్ ఎంపీ టికెట్లపై కూడా ఈ భేటీలో చర్చ జరగవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Latest News