‘కారు’కు అభ్యర్థులు కరువు

గతంలో తెరాస (ప్రస్తుత బీఆరెస్) పార్టీ టికెట్ దక్కాలంటే అదృష్టంగా భావించేవారు

  • Publish Date - January 20, 2024 / 11:05 AM IST

– పాలమూరు పార్లమెంట్ స్థానంలో పోటీకి నై అంటున్న బీఆరెస్ అభ్యర్థులు

– ఓటమి తప్పదనే ఆలోచనలో గులాబీ నేతలు

– అధిష్టానానికి తేల్చి చెప్పిన కొందరు నాయకులు

– సిటింగ్ ఎంపీ కూడా పోటీ చేసేందుకు విముఖత

– పాలమూరు ఎంపీ స్థానంలో పాతాళంలో బీఆరెస్

– కొత్త అభ్యర్థుల వేటలో పార్టీ అధిష్టానం

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: గతంలో తెరాస (ప్రస్తుత బీఆరెస్) పార్టీ టికెట్ దక్కాలంటే అదృష్టంగా భావించేవారు. ప్రస్తుతం టికెట్ ఇస్తామంటేనే మాకొద్దు బాబోయ్ అనే స్థాయికి పడిపోయింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ దెబ్బకు బీఆర్ఎస్ అందలం నుంచి పాతాళంలోకి కూరుకుపోయింది. దీంతో గులాబీ పార్టీకి దిక్కూదివానా లేకుండా పోయింది. రండి.. రండి.. టికెట్ ఇస్తామంటూ అధిష్టానం నాయకులు మైక్ పెట్టి అరిచినా నేతల్లో ఉలుకూపలుకు లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోయిన పరువు నిలబెట్టాలనుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాకపోవడంతో పరువు మరింత పోయే పరిస్థితి వచ్చింది. ఈ వాతావరణం మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలామంది నేతలు ఎంపీ టికెట్ కోసం అధిష్టానం ఎదుట క్యూ కట్టారు. అందులో ముందువరుసలో వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్ర శేఖర్ రెడ్డి ఉన్నారు. టీడీపీ లో సీనియర్ నేతగా ఉన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థి నిరంజన్ రెడ్డి తరపున ప్రచారం చేశారు. ఇదంతా పాలమూరు ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరిన ఆయన.. నిరంజన్ రెడ్డిని గెలుపు బాటలో నిలపలేక పోయారు. ఒక్క వనపర్తిలోనే కాదు జిల్లాలో మొత్తం రెండు స్థానాలు తప్పిస్తే అన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో చంద్రశేఖర్ రెడ్డి డైలమాలో పడ్డారు. టీడీపీలో ఉన్నా గౌరవం ఉండేదని, బీఆర్ఎస్ లో చేరి తప్పు చేశాననే భావనలో ఉన్నారు. ప్రస్తుతం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చినా ఆయన పెద్దగా స్పందించడం లేదు. ప్రస్తుతం ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ బలంగా ఉండడంతో గెలుపు కష్టం అనే ఉద్దేశంలో రావుల ఉన్నట్లు తెలుస్తోంది. తాను పోటీ చేయలేననే సంకేతాలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రావుల పోటీ పైనే ఆశలు పెట్టుకున్న అధిష్టానం ఆయన అభిప్రాయం తెలుసుకుని ఖంగు తింది. రావుల అంశాన్ని పక్కకు పెట్టి ఈ సెగ్మెంట్ లో ఓటమి చెందిన ఎమ్మెల్యేలను పోటీ లో నిలపాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. అధిష్టానం కూడా వీరిలో ఒకరికి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలపాలని భావించింది. కానీ ముందుగా ఆసక్తి చూపిన ఈ ఇద్దరు నేతలు తాజాగా పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ సెగ్మెంట్ లో 7 నియోజకవర్గాలు ఉండడం, ఈ ఏడింటిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండడమే వీరి వెనుకంజకు కారణమని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ భవన్ లో పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించిన సమయంలో అందరి నేతల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. కానీ పోటీ చేస్తామని ఒక్క నేత కూడా ముందుకు రాలేదు. పాలమూరులో పార్టీ పరిస్థితి బాగాలేదని కొందరు నాయకులు కేటీఆర్ కు తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు నాయకులు కృషి చేయాలని, పార్లమెంట్ స్థానంలో విజయం సాధించాలని కేటీఆర్ సూచించినా నేతల్లో ఆసక్తి కనిపించలేదు.

 

సిట్టింగ్ ఎంపీపైనే బీఆరెస్ చూపు 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంపీ అభ్యర్థిగా కొత్తవారికి టికెట్ ఇవ్వాలని గులాబీ బాస్ కేసీఆర్ అనుకున్నారు. సిటింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వకుండా కొత్తగా పార్టీలో చేరిన రావుల చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని భావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓటమి చెందింది. ఈ తరుణంలో ఎంపీగా పోటీ చేయాలని భావించిన వారంతా అధిష్టానం ఎదుట మొహం చాటేస్తున్నారు. టికెట్ కోసం ముందుగా పోటీ పడిన చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి ప్రస్తుతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. పార్టీ అధిష్టానం అటు.. ఇటు తిరిగి మళ్ళీ సిటింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి వైపు చూపు నిలిపింది. అంతకుముందు టికెట్ రాదని భావించిన మన్నేశ్రీనివాస్ రెడ్డి పలువురి వద్ద తన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ టికెట్ తనకే ప్రకటిస్తున్నారనే ప్రచారం జరగడంతో ఆయన కూడా పోటీలో ఉండాలా? వద్దా? అనే సంశయంలో ఉన్నారు. వేరే నేతలు ఆసక్తి చూపించి ఉంటే తనను పక్కన పెట్టేవారని, ప్రస్తుతం ఎవ్వరూ టికెట్ కోసం ముందుకు రాకపోవడంతో మళ్ళీ అధిష్టానం తన వైపు దృష్టి పెట్టిందనే ధోరణిలో ఆయన ఉన్నారు. ఏదిఏమైనా పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థుల కరువు వచ్చింది. బండ్లు ఓడలు…. ఓడలు బండ్లు అనే సామెత పాలమూరు బీ ఆర్ఎస్ పార్టీకి అచ్చు గుద్దినట్లు సరిపోతుంది.