విధాత: కారును పోలీన గుర్తులను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో బీఆరెస్ పార్టీ వేసిన పిటిషన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. బీఆర్ఎస్ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్ కొట్టివేస్తు కీలక వ్యాఖ్యలు చేసింది.
‘భారతీయ ఓటర్లు రాజకీయ నిరక్షరాస్యులు కాదు. ఓటర్లకు కారు, చపాతి రోలర్, రోడ్డు రోలర్ ల మధ్య తేడా తెలియదు అనుకుంటున్నారా?.. ఎన్నికలు వాయిదా వేయాలని మీరు కోరుకుంటున్నారా? హైకోర్టు తీర్పు తర్వాత దాదాపు 240 రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు రావడం ఏంటి?. అధికార పార్టీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదా?’ అంటూ బీఆర్ఎస్ పార్టీ న్యాయవాదులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓటర్లకు అన్ని తెలుసని వ్యాఖ్యానించింది. దీంతో బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలినట్టయ్యింది. సుప్రీం నిర్ణయంతో బీఆర్ఎస్ అధిష్టానం, ఆ పార్టీ అభ్యర్థులు ఆత్మరక్షణలో పడిపోయారు. కారును పోలిన గుర్తులను తొలగించాలంటూ న్యాయస్థానంలో బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
చపాతీ రోలర్, రోడ్డు రోలర్, తదితర గుర్తులను ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకుండా ఎన్నికల సంఘానికి ఆదేశించాలంటూ బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులతో నష్టపోయామని పిటిషన్‌లో పేర్కొంది. విచారణ చేపట్టిన ధర్మాసనం బీఆర్ఎస్ పిటిషన్‌ను కొట్టేసింది. ఓటర్లకు అన్ని విషయాలు తెలుసంటూ పిటిషన్‌పై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రగతి భవన్‌కు ఈసీ షాక్.. కోడ్ ఉల్లంఘనలపై నోటీస్‌లు
ప్రగతి భవన్‌కు ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ఉల్లంఘటన కింద నోటీస్‌లు జారీ చేసింది. ముఖ్యమంత్రి అధికారిక భవన్‌లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై నిన్న సాయంత్రం సీఈవో వికాస్‌రాజ్‌తో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సహా ఇతర అధికారులు చర్చించారు.
ఈ వివాదంలో ఎవరికి నోటీసులు ఇవ్వాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ప్రగతిభవన్ నిర్వహణ అధికారికి ఈసీ నోటీసులు పంపించింది. ప్రగతిభవన్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని నోటీస్‌లో పేర్కోంది.